Thursday, November 21, 2024

Minister Buggana – రాళ్ల నేలకు ‘న్యాయం’ – త్వరలోనే కర్నూల్లో లా యూనివర్సిటీ

కర్నూలు జిల్లా, నవంబర్, 19, ప్రభ న్యూస్ బ్యూరో. కర్నూలుకు రాజధాని హంగులు ఏర్పడేలా న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఆదివారం కర్నూలు జిల్లా, కల్లూరు మండలం లక్ష్మీపురంలోని న్యాయ విశ్వవిద్యాలయ ఏర్పాటు స్థలాన్ని మంత్రి బుగ్గన పరిశీలించారు. ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ జగన్నాథ్ గట్టుపై రూ.600 కోట్లతో 250 ఎకరాలలో నిర్మించబోయే లా యూనివర్శిటికి సంబంధించి డిసెంబర్ లో భూమి పూజ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎన్ఎల్ యూ) ఏర్పాటు చేస్తే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన లా విద్యార్థులు ఇక్కడ న్యాయ విద్యను అభ్యసించేందుకు వీలుంటుందన్నారు. ఇందుకోసం డిసెంబర్లో ముఖ్యమంత్రి పునాది రాయి వేయడానికి కర్నూలు వస్తే అక్కడ రహదారులు సహా ఇతర కనీస సదుపాయాలలో లోటు రాకుండా ఏర్పాటుపై ఇప్పటినుంచే దృష్టి సారించాలని ఆర్ అండ్ బీ అధికారులు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు

జగన్నాథ గట్టుమీద ఇప్పటికే 200 ఎకరాలలో ఇండియన్ ఇనస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన టెక్నాలజీ డిజైన అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ (ట్రిపుల్‌ ఐటీడీఎం) కళాశాల ఏర్పాటైందన్నారు. ఏపీ స్టేట్ హ్యుమన్ రైట్స్ కమిషన్, లోకాయుక్త కూడా ఇప్పటికే నెలకొల్పినట్లు ఆయన గుర్తు చేశారు. సిల్వర్ జూబ్లీ క్లస్టర్ యూనివర్శిటీకి కూడా 120 ఎకరాలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో విశ్రాంత అర్ అండ్ బీ ఎస్.ఈ జయరామి రెడ్డి, ఆర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.వి.శ్రీధర్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నిర్మల్ కుమార్, ఏ.ఈ స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.అంతకుముందు డోన్ మండల వైసీపీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ మల్లెంపల్లి రామచంద్రుడు కుమార్తె వివాహ వేడుకలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరయ్యారు. డోన్ లోని వీసీఎన్ కల్యాణ మండపంలో మూడు ముళ్లతో ఒక్కటైన కొత్త దంపతులు శ్రీలేఖ, సుధీర్ లను మంత్రి బుగ్గన అక్షింతలతో ఆశీర్వదించారు. అనంతరం కర్నూలులో వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) ఎండీ మురళీధర్ రెడ్డి గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి బుగ్గన పాల్గొన్నారు. మురళీధర్ రెడ్డి సతీమణి దేరెడ్డి హేమ 50వ పుట్టిన రోజని తెలియడంతో మంత్రి బుగ్గన ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement