డోన్, నంద్యాల జిల్లా : డోన్ పట్టణంలో ‘ఫోర్ కోర్ట్స్ కాంప్లెక్స్’భవన నిర్మాణానికి సంబంధించిన భూమిపూజలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భాగస్వామ్యమయ్యారు. డోన్ లో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, అడిషనల్ సివిల్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులతో పాటు అసిస్టెంట్ సెషన్స్ కోర్టులను బహుళ అంతస్తులుగా నిర్మించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండెకరాల విస్తీర్ణంలో రూ.23.5 కోట్లతో ఫోర్ కోర్ట్స్ నిర్మాణాల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.
గత 20 ఏళ్లుగా డోన్ కు సబ్ కోర్టు మంజూరు చేయాలంటూ ..న్యాయవాదులు రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు చేశారని మంత్రి ప్రస్తావించారు. ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో డోన్ కు రెవెన్యూ సబ్ డివిజన్ తో పాటు సబ్ కోర్టు మంజూరైందని స్పష్టం చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు కె.సురేష్ రెడ్డి,కె.శ్రీనివాసరెడ్డి,హరినాథ్ నూనెపల్లి సమక్షంలో శనివారం నాడు జరిగిన భూమిపూజ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు. అనంతరం పునాది రాయి వేసిన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కోర్టు కాంప్లెక్స్ నమూనాలను ఆర్థిక మంత్రి పరిశీలించారు.
అంతకుముందు పునాదిరాయి వేసిన తేదీ వివరాలకు సంబంధించిన గుర్తుగా జడ్జిలంతా కలిసి పైలాన్ ను ఆవిష్కరించారు. అనంతరం అందుకు చిహ్నంగా న్యాయమూర్తులు కపోతాలను ఆకాశం వైపు ఎగురవేశారు. రెండు దశాబ్ధాల కలను సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ల చొరవకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డోన్ లో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని జడ్జ్ లు, లాయర్లు సందర్శించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రేగటి రాజశేఖర్ రెడ్డి, జిల్లా న్యాయవాదులు పాల్గొన్నారు.
రూ.8.58 కోట్లతో ఆటోనగర్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.
డోన్ పట్టణంలోని జగదుర్తి వద్ద ఆటోనగర్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. పారిశ్రామిక పార్కులో రూ.8.58 కోట్ల విలువైన మౌలిక సదుపాయలతో ఏర్పాటు చేయనున్న ఆటోనగర్ కు ఆయన భూమి పూజ నిర్వహించారు. 36.09 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఆటోనగర్ లో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు వసతుల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదే పారిశ్రామిక పార్కులో కొంత మేర టెక్స్ టైల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీరాములు పాల్గొన్నారు.