Friday, November 22, 2024

మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం.. నేటితో ఉద్యోగ సమస్యకి పరిష్కారం

ప్రభుత్వ ఉద్యోగులతో సానుకూల వాతావరణంలో నిన్న చర్చలు జరిగాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తామని వెల్లడించారు. నేటితో సమస్యకి‌ పరిష్కారం ఉంటుందని భావిస్తున్నామని పేర్కొన్నారు. ఎచ్ఆర్ఏ శ్లాబులపై కూడా చర్చించామని, ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వమని మరోసారి స్పష్టం చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి శుక్రవారం నాటి చర్చల అంశాలను తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై సానుకూల నిర్ణయమే తీసుకుంటామని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా, చిత్తశుద్ధితో ఉందని తెలిపారు.

టిడ్కో ఇళ్ళల్లో మూడు కేటగిరీలు ఉన్నాయని మంత్రి బొత్స అన్నారు. వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ, 365 ఎస్ఎఫ్టీ, 430 ఎస్ఎఫ్టీ ఇళ్ళు నిర్మిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇళ్ళకు సంబంధించి లబ్ధిదారులే పూర్తిగా రుణాలు చెల్లించాల్సి ఉండేదన్నారు. 20 ఏళ్ళపాటు అసలు వడ్డీలతో సహా కట్టాల్సి వచ్చేదన్నారు. అప్పు తీరిన తర్వాతే ఆ ఇంటిపై వారికి సర్వ హక్కులు వచ్చేవని గుర్తు చేశారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు… తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళను..  ఒక్క రూపాయి కట్టించుకుని పేదలకు రిజిస్ట్రేషన్ చేసి, పూర్తి హక్కులతో ఇస్తున్నామని చెప్పారు. టిడ్కో ఇళ్ళు మొత్తం 2.62 లక్షలు ఉంటే.. వాటిల్లో 300 చ. అడుగుల ఇళ్ళు 1.43 లక్షల ఇళ్ళను ఉచితంగా ఇచ్చి, వారిని సొంత ఇంటిదారులను చేస్తున్నామన్నారు. వారికి, ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులతో ఇల్లు సొంతమవుతుందని చెప్పారు.  మిగిలిన రెండు కేటగిరీలకు సంబంధించిన ఇళ్ళకు, లబ్ధిదారుని పేరిట ఇచ్చే బ్యాంకు రుణాలకు ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా ఉంటుందని మంత్రి బొత్స వివరించారు.  

Advertisement

తాజా వార్తలు

Advertisement