విజయనగరం జిల్లా రామతీర్థంలో బోడికొండపై రామాలయ నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా వివాదం చోటు చేసుకుంది. శంకుస్థాపన గురించి ధర్మకర్తనైన తనతో చర్చించలేదని అశోక్ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఫలకాలను తోసివేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. ఈ వ్యవహారంపై ఏపీ పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.
అశోక్ వంటి పెద్ద మనిషి ఈ విధంగా వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. శంకుస్థాపనకు ఆహ్వానించడానికి వెళ్లిన ఆలయ ఈవో, ముఖ్య అర్చకులను అశోక్ దూషించారని బొత్స ఆరోపించారు. ఇదేమీ రాచరికపు వ్యవస్థ కాదన్నారు. అశోక్ గజపతిరాజు తన రాచరికపు అహంభావాన్ని వీడాలని సూచించారు. ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయని వ్యక్తి అశోక్ అని విమర్శించారు. తప్పు చేసిన వారిని ఆ రాముడే చూసుకుంటాడన్నారు. జిల్లాలో ఏనాడు ఇలాంటినీచమైన సాంప్రదాయాలు జరగలేదన్నారు. కనీస సంస్కృతి, సంప్రదాయం లేని లేని వ్యక్తి అని మండిపడ్డారు. రామతీర్ధ ఆలయాన్ని వైభవంగా, రెండో భద్రాద్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital