పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు తీర్పు బాధాకరమని అన్నారు. హైకోర్టు తీర్పుపై ఉన్నత సుప్రీం ఆశ్రయిస్తామని చెప్పారు. కేంద్ర నిబంధనల మేరకు ఇళ్ల స్థలాలు కేటాయించామని తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి అనుబంధంగానే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. ప్రతి మహిళ ఇంటి యజమానిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇళ్ల పథకం ప్రారంభించినట్లు వివరించారు. కోర్టు తీర్పులకు ప్రభుత్వం ఎప్పుడూ వ్యతిరేకం కాదని మంత్రి బొత్స స్పష్టం చేశారు. టీడీపీ తమ పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని బొత్స ఆరోపించారు. ప్రభుత్వం ముందుకు సాగకుండా టీడీపీ అడ్డుపడుతోందని మండిపడ్డారు. చంద్రబాబు 20 ఏళ్ల క్రితమే ప్రభుత్వ ఆస్తులు అమ్మి.. ఇప్పుడున్న ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు.య ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఆస్తుల విక్రయం సర్వసాధారణం అని పేర్కొన్నారు. కేంద్రం ఎయిరిండియాను అమ్మితే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయా? అని నిలదీశారు. ఎన్ని ఒడిదుడుగులు ఎదురైనా ఇచ్చినా హామీలను నెరవేరుస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
కాగా, సెంటు, సెంటున్నర స్థలాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలు చేపట్టొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇళ్ల కేటాయింపునకు తాము వ్యతిరేకం కాదన్న ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే మాత్రం తాము జోక్యం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. కేవలం మహిళలకే కాకుండా.. విడాకులు తీసుకున్న పురుషులకు, ట్రాన్స్‌జెండర్లకు కూడా ఇళ్లు కేటాయించాలని ఆదేశించింది. జగనన్న ఇళ్ల పథకంపై కమిటీ నివేదిక వచ్చే వరకూ ఇళ్ల నిర్మాణాలు ఆపాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి: Huzurabad By Eelection: కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్స్ వీరే..