Tuesday, November 26, 2024

చెర‌కు రైతుల‌కు బ‌కాయిలు చెల్లిస్తాం: మంత్రి బొత్స స్పష్టీకరణ

చెర‌కు రైతుల‌కు బ‌కాయిలు పూర్తిగా చెల్లిస్తామని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఎన్‌సిఎస్ సుగ‌ర్స్‌కు చెందిన 24 ఎక‌రాల‌ను వేలం వేసి ఆ సొమ్ముతో బ‌కాయిలు చెల్లించేందుకు చ‌ర్యలు తీసుకుంటామన్నారు. ఎన్‌సీఎస్‌ షుగర్‌ ఫ్యాక్టరీతో  రైతుల బకాయిల వివాదంపై మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రైతుల డిమాండ్, యాజమాన్య వైఖరిపై చర్చించారు. ఈ సందర్భంగా పోలీసులపై దాడి, పోలీస్ సిబ్బందికి గాయాల విషయాన్ని జిల్లా ఎస్‌పీ దీపికా మంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి.. రైతులకు త్వరగా న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యాజమాన్యంతో చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స స్పష్టం చేశారు.

ఎన్‌సిఎస్ సుగ‌ర్స్ పై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తాం అని మంత్రి అన్నారు. ఫ్యాక్టరీ భూములను విక్రయించి, రైతుల బ‌కాయిల‌ను వీలైనంత త్వర‌గా చెల్లిస్తామన్నారు. రూ.10 కోట్లు విలువైన పంచ‌దార‌ను ఇప్పటికే ప్రభుత్వం సీజ్ చేసిందన్న మంత్రి.. తమది రైతు ప‌క్షపాత ప్రభుత్వం అని తెలిపారు. రైతు సంక్షేమ‌మే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రతిప‌క్షాలు చేసే త‌ప్పుడు ప్రచారాన్ని న‌మ్మవ‌ద్దన్నారు. తమ సమస్యలపై నిర‌స‌న తెలిపే హ‌క్కు, ధ‌ర్నా చేసే హ‌క్కు అంద‌రికీ ఉంటుంది. కానీ పోలీసుల‌పై రాళ్లేసే సంస్కృతి స‌రికాదన్నారు. ఆందోళ‌న‌ను ప్రక్కదారి ప‌ట్టించేందుకు రైతుల ముసుగులో వామపక్షాలు, టిడిపి ప్రోత్సాహంతో ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై ప్రభుత్వం కఠినచర్యలు తీసుకుంటుందన్నారు. రాజ‌కీయ ల‌బ్దికోసం రైతుల‌ను అడ్డుపెట్టుకోవ‌ద్దని మంత్రి బొత్స హితవు పలికారు.

కాగా, కాగా 2019-20 చెరుకు రైతులకు ఎన్‌సీఎస్‌ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 16 కోట్ల 50 లక్షలు బకాయిపడింది,  ఈ ఏడాది పరిశ్రమలో చెరుకు క్రషింగ్ చేయకపోవడం, రైతుల బకాయిలు చెల్లించకపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు. అలాగే రైతుల పేరుతో షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నకిలీ ధ్రువపత్రాలు సమర్పించి రూ. 70 కోట్లు బ్యాంకు ఋణం తీసుకుంది. దీంతో రుణాలు తీర్చమని రైతులకు బ్యాంకులు నోటీసులు ఇచ్చింది. వీటికి తోడు షుగర్‌ ఫ్యాక్టరీ.. కార్మికులకు మరో 5 కోట్ల బకాయిలు చెల్లించాలి. మొలాసిస్, ఫ్యాక్టరీ భూములు అమ్మి బకాయిలు తీర్చుతామని హామీ ఇచ్చి విస్మరించింది. ఈ నేపథ్యంలో షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని రైతు సంఘం డిమాండ్‌ చేస్తోంది. 

ఇది కూడా చదవండి: కుక్కలకు షెల్టర్ గా.. ఏటీఎం సెంటర్!

Advertisement

తాజా వార్తలు

Advertisement