Friday, November 22, 2024

కుటుంబస‌భ్యుల‌తో గంగ‌మ్మ‌కి సారె స‌మ‌ర్పించిన.. మంత్రి అంబ‌టి రాంబాబు

తిరుపతి సిటీ ప్రభ న్యూస్.. తిరుపతి గంగ జాతర సందర్భంగా రాష్ట్ర జల వనరుల శాఖ.మంత్రి అంబటి రాంబాబు సోమవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి గంగమ్మకు సారె సమర్పించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు మంత్రి అంబటి రాంబాబుకు పూర్ణకుంభ స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేపట్టారు. అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మంత్రి రాంబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తిరుపతితో పాటు రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా చూడాలని గంగమ్మ తల్లిని వేడుకున్నట్టు తెలిపారు. కిందటేడాది కూడా గంగమ్మ‌ జాతరకు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నామ‌న్నారు. ఈ ఏడాది కూడా కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి సారె సమర్పించి, దర్శించుకోవడం అదృష్టంగాభావిస్తున్నట్టు చెప్పారు.

గత ఏడాదికంటే ఈసారి ఇంకా అద్భుతంగా జాతర జరుగుతోందని వివరించారు.కొండమీద బ్రహ్మోత్సవాల తరహాలో ఇక్కడ శ్రీవేంకటేశ్వర స్వామి వారి చెల్లి గంగమ్మ తల్లికి జాతర నిర్వహిస్తుండడం సంతోషకరమని మంత్రి అన్నారు.హైందవ సంస్కృతి, భక్తి మరుగున పడిపోతున్న దశలో శాసన సభ్యులు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడంసంతోషంగా ఉందన్నారు.జాతరను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం చాలా గర్వకారణమని పేర్కొన్నారు. మిత్రుడు ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ప్రోద్బలంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం చాలా సంతోషకరమన్నారు. ఇది వారికిసంప్రదాయల పట్ల, హైందవ మతం పట్ల ఉన్న గౌరవాన్ని చాలా స్పష్టంగా తెలియపరుస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి.నగర మేయర్ డాక్టర్.శిరీష, ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపీ యాదవ్, ఈవో మునికృష్ణ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement