Friday, November 22, 2024

ఎపిలో కొండంత దోపిడి..

మాఫియా ఖద్దర్‌ చేతివాటం… అధికారులకు వాటా
ప్రభుత్వ భూముల్లో అడ్డంగా తవ్వకాలు
అనుమతులు గోరంత… తవ్వకాలు కొండంత
నిత్యం వందలాది లారీలు అక్రమ రవాణా
చోద్యం చూస్తున్న మూడు శాఖల అధికారులు
స్థానిక ప్రజా ప్రతినిధుల అండతో రెచ్చిపోతున్న మాఫియా
కరిగిపోతున్న ఖనిజ సంపద… రోజుకు లక్షల్లో దందా
నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ దోపిడీ
ప్రభుత్వ ఆదాయానికి అడుగడుగునా తూట్లు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఖనిజ సంపద దోపిడీ మాత్రం ఆగడం లేదు. గతంలో తెలుగు దేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అప్పటి నేతలు పోటీపడి మరీ గ్రావెల్‌ను దోచుకున్నారు. గత మూడున్నర సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లోనూ దోపిడీ ఆగలేదు. అంతకు రెండింతలు పెరిగింది. అయితే, ఖనిజ సంపదను దోచుకునే సందర్భంలో ఆయా జిల్లాల్లో తెలుగు దేశం, వైసీపీ నేతల మధ్య కొత్త యుద్ధం తెరపైకి వస్తోంది. గతంలో భారీగా తవ్వకాలు జరిగిన ప్రాంతంలోనే ప్రస్తుతం మరికొంత మంది గ్రావెల్‌ తవ్వకాలను చేపడుతున్నారు. దీంతో అనేక సందర్బాల్లో ఆ ప్రాంతాలు ప్రమాదాలకు నిలయంగా మారుతు న్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఆందోళన చేస్తుండగా మరికొన్ని ప్రాంతా ల్లో అధికార పార్టీ నేతలు మాఫియాకు మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో తరచుగా ఏదో ఒక ప్రాంతం లో గ్రావెల్‌ తవ్వకాలపై ఘర్షణలు ఆందోళనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే, ఆయా జిల్లాలకు చెందిన అధికారులు గ్రావెల్‌, మట్టి, ఇసుక, కంకర వంటి ఖనిజ సంపదను తవ్వుకునే సందర్భంలో వాటికి సంబంధించిన అనుమతులు క్వారీ లీజు, లైసెన్సులు తదితర నిబంధనలు నూటికి నూరు శాతం అమలుపర్చేలా చూడాల్సిందిపోయి మాఫియాతో చేతులు కలిపి మాకెంత అంటూ వాటాలు పంచుకుంటున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రావెల్‌ అధికంగా ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున దోపిడీ సాగుతోంది. వాటిలో కనీసం 30 శాతం క్వారీలకు కూడా సరైన అనుమతులు ఉండటం లేదంటే ఏస్థాయిలో గ్రావెల్‌ దోపిడీ జరుగుతోందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.


ఖనిజ సంపదకు రాష్ట్రం పెట్టింది పేరు. వివిధ జిల్లాల్లో విలువైన ఖనిజ సంపద పుష్కలంగా లభిస్తోంది. తిరుపతి జిల్లాలో సిలికా, నెల్లూరు జిల్లాలో గ్రావెల్‌, ప్రకాశం జిల్లాలో యర్రమట్టి, గోదావరి జిల్లాల్లో ఇసుక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మైకా ఇలా చెప్పుకుంటూ పోతే అత్యంత విలువైన ఖనిజ సంపద రాష్ట్రంలో ఉంది. వీటి ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏటా కోట్లాది రూపాయలు ఆదాయం కూడా లభిస్తుంది. అయితే, వివిధ జిల్లాల్లో క్వారీలకు సంబంధించి లైసెన్సుల మంజూరు లోనూ గతంలో ఇచ్చిన లీజు అనుమతులు పొడిగింపులోనూ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో క్రమేణా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ప్ర స్తుత వైసీపీ ప్రభుత్వంలో ఖనిజ శాఖ ద్వారా ప్రతి ఏటా వస్తున్న ఆదాయం పెరిగినప్పటికీ కొంత మంది అక్రమార్కుల వల్ల మరింత ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోవాల్సి వస్తోంది. మాఫియా, ఆయా ప్రాంతానికి చెందిన అధికార పార్టీకి చెందిన నేతలు చేతులు కలిపి ఖనిజ సంపదను కొల్లగొట్టడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.

అనుమతులు గోరంత.. తవ్వకాలు కొండంత

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని దగదర్తి, బోగోలు మండలాల పరిధిలో లభించే గ్రావెల్‌కు మంచి డిమాండ్‌ ఉంది. దీంతో జిల్లా వ్యాప్తంగా వాణిజ్యపరమైన అవసరాలకు ఈప్రాంతం నుండే గ్రావెల్‌ను తీసుకెళ్తుంటారు. మైనింగ్‌ శాఖ అధికారులు కూడా ఆదిశగానే కొన్ని గ్రామాల పరిధిలో గ్రావెల్‌ తవ్వకాలకు అనుమతులు ఇచ్చారు. అయితే, కావలికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి అండదండలతో గ్రావెల్‌ మాఫియా కేవలం ఒకటి రెండు అనుమతులు మాత్రమే మొక్కుబడిగా తీసుకుని పై రెండు మండలాల పరిధిలో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. నిత్యం వందలాది ట్రిప్పర్లలో టన్నుల కొద్దీ గ్రావెల్‌ కావలి, నెల్లూరు నగరంలోని రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లకు అక్రమంగా తరలించి లక్షల్లో దోచుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో కూడా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా గ్రావెల్‌ తవ్వకాలను చేపడుతున్నారు. దగదర్తి మండల పరిధిలోని తడకలూరు, చౌటకుర్తేడు రెవెన్యూలోని 153 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిలో మూడు కిలోమీటర్ల మేర ఇటీవల గ్రావెల్‌ తవ్వకాలను చేపట్టారు. ఈప్రాంతంలో తవ్వకాలపై స్థానిక ప్రజలు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ఆందోళనకు దిగారు. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ జిల్లా నాయకులు కూడా ఆప్రాంతానికి వచ్చి అక్రమ తవ్వకాలను పరిశీలించారు. ఈసందర్భంలో మాఫియాకు, టీడీపీ నాయకుల మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. అయితే, అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడు మాఫియాకు వత్తాసు పలకడంతో ఆయా ప్రాంతాల పరిధిలో యధేచ్చగా గ్రావెల్‌ అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. అదే విధంగా బోగోలు మండలం తిప్ప, ఎస్టీ కాలనీ సమీపంలో కూడా ఇదే తరహాలో అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దగదర్తి విమానాశ్రయ భూములకు సమీపంలో కూడా మరో 35 ఎకరాల్లో గత కొంత కాలంగా మాఫియా వందలాది లారీల్లో గ్రావెల్‌ను తరలిస్తూనే ఉన్నారు. ఒక్కో ట్రిప్పర్‌ ఖరీదు రూ. 5 వేల నుండి రూ. 7 వేలు పలుకుతుండటంతో కావలి ప్రాంతానికి చెందిన కొంత మంది అధికార పార్టీ నేతలు మాఫియాగా అవతారం ఎత్తి గ్రావెల్‌ దందానే దినచర్యగా పెట్టుకున్నారు. ఇదే తరహాలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి, మార్కాపురం, కలిగిరి తదితర ప్రాంతాల్లో కూడా గ్రావెల్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.

కరిగిపోతున్న ఖనిజ సంపద .. రోజుకు లక్షల్లో దందా
దగదర్తి, బోగోలు మండలాల పరిధిలో నిత్యం వంద నుండి రెండు వందలకు పైగా ట్రిప్పర్లలో గ్రావెల్‌ అక్రమ రవాణా సాగుతోంది. ఒక్కో ట్రిప్పర్‌లో ఆరు ట్రాక్టర్ల సామర్ధ్యం కలిగిన గ్రావెల్‌ ఉంటుంది. నిబంధనల మేరకు అనుమతులు తీసుకున్నా అంత సామర్ధ్యం కలిగిన వాహనాల్లో గ్రావెల్‌ను తరలించకూడదు. అందుకు ఆయా శాఖల నుండి అనుమతులు తీసుకోవాలి. అందుకు సంబంధించి ప్రభుత్వానికి కొంత సొమ్ము కూడా చెల్లించాలి. అయితే, అవేమీ చెల్లించకుండానే సంబంధిత శాఖల నుండి ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిత్యం వందలాది ట్రిప్పర్లలో గ్రావెల్‌ను రాజమార్గంలోనే పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పర్‌ ధర రూ. 5 వేల నుండి రూ. 7 వేలు ఉంటుంది. దీనినిబట్టి చూస్తుంటే రోజుకు పై రెండు మండలాల పరిధిలోనే రూ. 15 లక్షల నుండి రూ. 20 లక్షల విలువైన గ్రావెల్‌ను మాఫియా దోచుకుంటోంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో పరిస్తితి మరింత దారుణంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇదే తరహాలో జరుగుతున్న అక్రమ రావాణాను బట్టి చూస్తుంటే ప్రభుత్వ ఖజానాకు రావల్సిన ఆదాయం పెద్ద ఎత్తున పక్కదారి పడుతోంది. ఇప్పటికైనా సంంధిత శాఖలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న గ్రావెల్‌ అక్రమ రవాణాతోపాటు కావలి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారిస్తే మాఫియా గుట్టు రట్టవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement