అమరావతి, అమరావతి ధాన్యానికి కనీస మద్దతు ధర లభించేలా చట్టాన్ని తీసుకువస్తున్నట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈనెల 21 నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో కనీస మద్దతు ధర చట్టాన్ని (ఎంఎస్ పీ యాక్ట్) ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం జట్లకొండూరు గ్రామంలో బుధవారం అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైతులు పండించిన ధాన్యానికి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఎంఎస్ పీ యాక్ట్ ను అమలు చేయనున్నట్టు తెలిపారు.
అన్నదాతలకు అండగా నిలవాలనే గొప్ప లక్ష్యంతో రైతులకు కనీసం మద్దతు ధర కల్పించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి సంకల్పించారనీ, ఈ మేరకు ఎంఎస్ పీ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం వ్యవసాయశాఖ మంత్రిగా తనకు దక్కటం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించడం, అమలయ్యేలా చూడడం, అమలు చేయకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలను చట్టంలో పొందుపరుస్తున్నట్టు తెలిపారు.
రైతాంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను గడిచిన నాలుగున్న ఏళ్లలో పరిష్కరించాం.. దశాబ్దాల తరబడి సాగుదారులు ఎదుర్కొంటున్న చుక్కల భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. రైతులెవ్వరూ రెవెన్యూ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా భూ సమస్యలను పరిష్కరిస్తున్నామని కాకాని తెలిపారు.