Saturday, November 23, 2024

మినరల్‌ వాటర్‌ అదొక భ్రమ.. తాగుతున్నది విషతుల్య భూగర్భ జలాలే

అమరావతి, ఆంధ్రప్రభ : ప్రజల్లో దాదాపు 80శాతం మినరల్‌ వాటర్‌ని వినియోగిస్తున్నారు. ఒకప్పుడు మినరల్‌ వాటర్‌ స్టేటస్‌ సింబల్‌. కాని నేడు ప్రతి ఇంటా వాటర్‌ క్యాన్‌లే. పది రూపాయలు ఇస్తే 20 లీటర్ల క్యాన్‌ క్షణాల్లో గడప ముంగిట ఉంటుంది. ప్రతీ వీధిలో రెండుకు తక్కువ కాకుండా మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు. అప్పట్లో పెద్ద పెద్ద కంపెనీలు తయారు చేసిన బ్రాండెడ్‌ వాటర్‌ బాటిళ్ళు మార్కెట్‌లో లభించేవి. ఇప్పుడు ప్రతీ బడ్డీ కొట్లో రెండు రూపాయలకే వాటర్‌ ప్యాకెట్లు. అడ్రస్‌ లేని పేర్లతో ఇబ్బడి ముబ్బడిగా పావు లీటర్‌ బాటిల్‌ నుంచి 20 లీటర్ల క్యాన్‌ వరకు మార్కెట్‌లో లభిస్తున్నాయి. మరి సీల్డ్‌, ప్యాక్‌డ్‌ మినరల్‌ వాటర్‌ పేరుతో మనం తాగుతున్న నీరు సురక్షితమేనా.. అసలు ఈ నీరు ఎక్కడి నుంచి వస్తోంది. ఆయా వాటర్‌ ప్లాంట్‌లు తయారీ చేసే తాగునీరు పరిశుభ్రమేనా అని మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. కుటీర పరిశ్రమల్లా మారిపోయిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ల నుంచి సరఫరా అవుతున్న తాగునీరు ఏమాత్రం సురక్షితం కాదనే స్పష్టమవుతోంది.

- Advertisement -

నిబంధనలు ఏమాత్రం పాటించని మినరల్‌ వాటర్‌ ప్లాంట్ల నిర్వహకులు కలుషిత భూగర్భ జలాలను నామమాత్రంగా శుద్ధి చేస్తూ ప్రతి ఇంటికి అనారోగ్యాన్ని సరఫరా చేస్తున్నారు. ఈ నీళ్లకు అలవాటు పడిన ప్రతి ఒక్కరూ పైకి మాత్రం మినరల్‌ వాటర్‌ తాగుతున్నామన్న భ్రమలో ఉంటున్నారే తప్ప క్రమేణా శరీరంలో పెరుగుతున్న అనారోగ్య సమస్యలు ఈ నీటి వల్లేనని మాత్రం గ్రహించలేపోతున్నారు. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుంచి జీర్ణ ప్రక్రియ సమస్య, డయేరియా, జలుబు, దగ్గు, ఇతర దీర్ఘకాలిక సమస్యలు, విషతుల్య కారకాలు శరీరంలో పేరుకుపోవడం వంటి ప్రమాదకర పరిస్ధితులను ఎదుర్కొంటున్నారు. మిన రల్‌ వాటర్‌ ప్లాంట్లు భూగర్భ జలాలను వెలికి తీసి శుద్ధి చేసి ప్ర మాణాలకు అనుగుణంగా తాగునీరుగా మార్చి సరఫరా చేయాల్సి ఉంది. అయితే దీనికి భిన్నంగా కాలుష్య, నాసిరకం నీటిని విక్రయిస్తున్నట్లు సాక్షాత్తు విజిలెన్స్‌ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. విజిలెన్స్‌ పరిశోధనలో మినరల్‌ వాటర్‌ తయరీలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగు చూశాయి.

భద్రత ప్రమాణాల ఉల్లంఘన..

రాష్ట్రంలో కొన్ని మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు సరైన అనుమతులు లేకుండా నిర్వహిస్తున్నారని, ప్రజలకు నాసిరకం సురక్షితం కాని నీటిని విక్రయిస్తూ 2016 ఆహార భద్రతా ప్రమాణాల చట్ట ం నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 51 మినరల్‌ వాటర్‌ ప్లాంట్లపై దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కళ్లు చెదిరే అంశాలు గుర్తించారు. తనిఖీ చేసిన వాటిలో దాదాపు అన్ని వాటర్‌ ప్లాంట్‌లలో భూగర్భ జలాల పరీక్షలు జరగడమే లేదు. ఇందుకోసం పాంట్లలో ల్యాబ్‌లు లేవు. ల్యాబ్‌ పరికరాలు ఏర్పాటు చేయనే లేదు. బోరు నుంచి తీస్తున్న భూగర్భ జలాలను కేవలం వడపోత పడుతూ రంగు, రుచి మారేలా కొద్దిపాటి మార్పులు చేసి ప్యాకింగ్‌ చేస్తున్నట్లు వెల్ల డైంది.

ఇక అనధికారికంగా నిర్వహించబడుతున్న అనేక ప్లాంట్లు భూగర్భ జలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించుకునేందుకు తాహశీల్దారు నుంచి అనుమతులు లేకపోవడాన్ని గుర్తించారు. చాలా వరకు వాటర్‌ ప్లాంట్లు పరిశుభ్రంగా లేకపోగా బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ యాక్ట్‌ సర్టిఫికేట్‌ పొందలేదు. ఇక ప్యాకింగ్‌ విషయానికొస్తే బాటిల్‌పై బ్రాండ్‌ పేరును మాత్రమే తప్ప బ్యాచ్‌ నంబర్‌, కోడ్‌ నంబర్‌, ప్రాసెసింగ్‌ తేదీలు లేవు. పబ్లిక్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌, గ్రౌండ్‌ వాటర్‌ డిపార్ట్‌మెంట్‌, పరిశ్రమల శాఖ, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ నుండి ట్రేడ్‌ లైసెన్స్‌లు, ఇతర ముఖ్యమైన సర్టిఫికేట్‌లు లేకుండా అనధికారంగా నడుస్తున్నాయి. ఇక రికార్డుల నిర్వహణ సరే సరి.

తనిఖీ చేసిన జిల్లాలు ఇవే..

శ్రీకాకుళం జిల్లాలో 2 వాటర్‌ ప్లాంట్లు, విజయనగరం జిల్లాలో 2 వాటర్‌ ప్లాంట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 2, విశాఖపట్నం జిల్లాలో 5, అనకాపల్లి జిల్లాలో 2, ప్రకాశం జిల్లాలో 13, పశ్చిమగోదావరి జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 4, గుంటూరు జిల్లాలో 2, కడప జిల్లాలో 2, అనంతపురం జిల్లాలో 2, శ్రీ సత్యసాయి జిల్లాలో 2, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణాజిల్లా, ఎన్టీఆర్‌ జిల్లా, బాటప్ల, పల్నాడు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య తదితర జిల్లాల్లో విజిలెన్స్‌ అధికారులు జరిపిన తనిఖీల్లో అన్ని వాటర్‌ ప్లాంట్లలో ఇదే దుస్ధితి. తనిఖీల్లో వెలుగు చూసిన ప్రమాదకర అంశాలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం ద్వారా నిర్వహకులపై చర్యలకు సిఫార్సు చేయనున్నట్లు విజిలెన్స్‌ డీజీ శంక భ్రత బాగ్చీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement