Sunday, November 17, 2024

కూల్ గా…… దోపిడి…

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: మినరల్‌ వాటర్‌ వ్యాపారులకు కాసులు కురిపిస్తున్నాయి. కొంత మంది వ్యాపారులు ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మినరల్‌ వ్యాపారం ముసుగులో కూల్‌గా.. దోపిడీ చేసేస్తున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మంచినీరు కూడా కలుషితం అయిపోతున్నది. దీంతో పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెవాసులు కూడా అత్యధిక శాతం శుద్ధి జలాలపై ఆధారపడాల్సి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 80 శాత ం మందికి పైగా ప్రజలు మినరల్‌ వాటర్‌నే ఉపయోగిస్తున్నారంటే రాష్ట్రంలో మినరల్‌ వాడకం ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్ధమ వుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది తక్కువ పెట్టుబడితో నాణ్యత లేని మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లను ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్దంగా భూగర్భజలాలను తోడేస్తున్నారు. అవే జలాలకు మినరల్‌ వాటర్‌ పేరు తొడిగి వాటికి ధర నిర్ణయించి ప్రజలకు విక్రయిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో నాణ్యత లేని జలాలను ఉపయోగిస్తున్న ప్రజలు కొన్ని సందర్భాల్లో విలువైన ఆరోగ్యాలను కోల్పోవాల్సి వస్తోంది. ప్రత్యేకించి వేసవిలో మినరల్‌ వాటర్‌ అమ్మకాలు రెండింతలు పెరగడంతో ఆయా ప్రాంతాల్లో మరెన్ని ప్లాంట్‌లను ఏర్పాటు చేసి బోగస్‌ కంపెనీల పేరుతో వాటర్‌ బాటిళ్లపై స్టిక్కర్లు అంటించి బ్రాండెడ్‌ కంపెనీలా మినరల్‌ వాటర్‌లా అమ్మకాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాలతో పాటు రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్లు, హోటళ్లలో అత్యధిక శాతం గుర్తింపు లేని కంపెనీ మినరల్‌ వాటర్‌నే సరఫరా చేస్తున్నారంటే రాష్ట్రంలో మినరల్‌ వాటర్‌ పేరుతో అక్రమ వ్యాపారాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

రోజుకు రూ.100 కోట్లకు పైగా రాష్ట్రంలో మినరల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. వాటిలో 70 శాతం పైగా వ్యాపార సంస్థలకు అనుమతులు లేవు. మిగిలిన 30 శాతం కంపెనీలకు సంబంధించి కూడా మరో 8 శాతం కంపెనీలు కనీస నిబంధనలను పాటించడం లేదు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లపై గాని, ఆయా వ్యాపార సంస్థలపై గాని కనీస తనిఖీలు కూడా చేపట్టకపోవడం పలు సందేహాలకు దారి తీస్తోంది. కొన్ని కంపెనీలు అనుమతులు తీసుకోకుండా మినరల్‌ వాటర్‌ను తయారు చేసి అమ్మకాలు జరుపుతుండడంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా ఆవిరైపోతుంది. అదే అధికారులు తనిఖీలు చేసి ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తే నాణ్యమైన వాటర్‌ అందుబాటులో ఉండడంతో పాటు ప్రభుత్వానికి కూడా మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అధికారులు అడుగులు వేయక పోవడం, నకిలీ సంస్థలపై ఉక్కుపాదం మోపకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.


అనుమతులు లేకుండా..ప్లాంట్లు ఏర్పాటు
రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో లెక్కకు మించి మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లు ఉన్నాయి. వాటిలో వందల సంఖ్యలో వివిధ కంపెనీల పేరుతో వాటర్‌ ప్యాకెట్లు, బాటిళ్లు, క్యాన్లను తయారు చేస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో అయితే వీధికో ప్లాంట్‌ కని పిస్తుంది. వాటిలో సగానికి పైగా అనుమతులు లేనివే. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతీ ఊరికి ఓ ప్లాంట్‌ ఉంది. మరికొన్ని గ్రామాల్లో అయితే అనుమతులు లేకుండానే ప్లాంట్‌లు ఏర్పాటు చేసి 20 లీటర్ల క్యాన్‌ను రూ.5 నుంచి రూ.10కి విక్రయిస్తున్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో లీటర్‌ వాటర్‌ బాటిళ్లు, 500 ఎం.ఎల్‌, 300 ఎం.ఎల్‌, 200 ఎం.ఎల్‌ పేరుతో మినరల్‌ వాటర్‌ బాటిల్‌ను రకరకాల రంగులతో తయారు చేసి కేసుల లెక్కన సరఫరా చేస్తున్నారు. వాటిలో 40 శాతం పైగా బోగస్‌ సంస్థలే. ఎక్కడా అనుమతులు తీసుకున్న దాఖలాలు కూడా లేవు. సాధారణంగా వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే ముందుగా నాణ్యమైన భూగర్భజలాలు అందుబాటులో ఉన్న ప్రాంతంలో ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతులు తీసుకోవాలి. అందుకు సంబంధించి దాదాపుగా 5 శాఖల అనుమతులు ఉండాలి. ట్రాన్స్‌పోర్టుతో పాటు గోడౌన్‌ ఏర్పాటుకు సంబంధించి సంబంధిత అధికారుల అనుమతులు తీసుకోవాలి, ప్రత్యేకించి శుద్ధి యంత్రాలు ఏర్పాటు చేసే సమయంలో బ్రాండెడ్‌ యంత్రాలనే కొనుగోలు చేయాలి. కనీసం లక్ష లీటర్లు నీటిని శుద్ధి చేసిన తర్వాత అందుకు సంబంధించిన ప్లాంట్‌ ఫిల్టర్‌లను మార్పులు చేస్తూ ఉండాలి. ఇన్ని నిబంధనలు ఉన్నప్పటికీ కనీసం 20 శాతం ప్లాంట్లలో కూడా చూద్దామన్న నిబంధనలను పాటించడం లేదు. ఇంత జరుగుతున్నా ఆయా శాఖల అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప అనుమతులు లేని ప్లాంట్‌లపై దాడులు చేసి సీజ్‌ చేస్తున్న దాఖలాలు చూద్దామన్న కనిపించడం లేదు.


పట్టణ ప్రాంతాల్లోని స్టార్‌ హోటల్స్‌తో పాటు కొన్ని డాబా హోటళ్లలో సైతం సొంత బ్రాండ్ల పేరుతో హోటల్‌లో బాటిల్‌ను సరఫరా చేస్తున్నారు. అందుకు సంబంధించి బిల్లులో లీటర్‌ బాటిల్‌ రూ.20 నుంచి రూ.25 వసూలు చేస్తున్నారు. సాధారణంగా బాటిల్‌ మినరల్‌ వాటర్‌ను తయారు చేయడానికి ఆయా సంస్థలకు రూ.5 నుంచి రూ.8 వరకు మాత్రమే ఖర్చవుతుంది. ధరల విషయంలో నియంత్రణ లేదు. హోటల్‌ యజమానులది, ప్లాంట్‌ నిర్వాహకులదే ఇష్టారాజ్యం. అనుమతులు లేకుండా సొంత ప్లాంట్‌లు ఏర్పాటు చేసుకుని హోటల్‌లో బాటిల్‌ను విక్రయిస్తున్నా పట్టించుకునే వారే కరువవుతున్నారు. కొన్ని హోటళ్లలో మినరల్‌ వాటర్‌ వంద శాతం నాణ్యంగా ఉంటున్నప్పటికీ, 80 శాతం పైగా హోటళ్లలో నీరు శుద్ధి కావడం లేదు. నాశిరక జలాలతోనే బాటిల్‌ నింపి మినరల్‌ వాటర్‌గా విక్రయిస్తున్నారు. ఈ తరహా వ్యాపారం ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా జోరుగా సాగుతోంది.

- Advertisement -


రోజుకు రూ.100 కోట్లకు పైగా..వాటర్‌ అమ్మకాలు
ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా మినరల్‌ వాటర్‌ అమ్మకాలు అంచనాలకు మించి సాగుతున్నాయి. కోటేశ్వరుడి నుంచి సామాన్య మానవుడు సైతం తమ ఆరోగ్యాలను కాపాడుకునేందుకు అత్యధిక శాతం మినరల్‌ వాటర్‌పైనే ఆధారపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే డబ్బును లెక్కచేయకుండా నాణ్యమైన నీటి కోసం ప్రతి నెల కొంత బడ్జెట్‌ను కేటాయించుకుంటున్నారు. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో సైతం సగటున ఒక మనిషి రోజుకు 4 నుంచి 5 బాటిళ్లు వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక మనిషి రోజుకు మినరల్‌ వాటర్‌ కోసం రూ.100 వరకు వెచ్చిస్తున్నారు. ఇదే సందర్భంలో ఇళ్లలో ఉండే ప్రజలు సైతం 20 లీటర్ల క్యాన్‌ వాటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. క్యాన్‌ ధర ప్రాంతాన్ని బట్టి, సీజన్‌ను బట్టి రూ.20 నుంచి రూ.30లకు విక్రయిస్తున్నారు. రోడ్డు మార్జిన్‌లో ఉండే తోపుడు బండి టిఫిన్‌ సెంటర్లు సైతం ఇవే క్యాన్లను కొనుగోలు చేసి టిఫిన్‌ చేసే వారికి మినరల్‌ వాటర్‌ను అందిస్తున్నాయి. ఇలా పట్టణ ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతాల వరకు 80 శాతం మంది ప్రజలు నిత్యం మినరల్‌ వాటర్‌నే కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో రోజుకు రూ.100 కోట్లకు పైగా వాటర్‌ అమ్మకాలు సాగుతున్నాయి. ఇంత పెద్దఎత్తున మినరల్‌ అమ్మకాలు సాగుతున్నా ఆ రంగం నుంచి ప్రభుత్వానికి మాత్రం ఆశించిన స్థాయిలో ఆదాయం లభించడం లేదు. అనుమతులతో పాటు చెల్లించాల్సిన ట్యాక్స్‌లు కూడా సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుంది. కోట్లల్లో వ్యాపారం జరుగుతున్నా సంబంధిత అధికారులు కమీషన్లకు కక్కుర్తి పడి అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో విలువైన ఆరోగ్యంతో పాటు ఆర్ధికంగా ప్రజలు రెండు రకాలుగా నష్టపోవాల్సి వస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement