ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారనే ఆరోపణలతో నలుగురు ఎమ్మెల్యేలని తొలగించింది వైసీపీ పార్టీ. కాగా సస్పెన్షన్‌కు గురైన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తొలిసారి మీడియా ముందుకొచ్చారు. హైదరాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్ పై మండిపడ్డారు. జగన్ కొట్టిన దెబ్బకు నా మైండ్ బ్లాంక్ అయ్యింది.. నాపై ఆరోపణలు చేసినవారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్యే శ్రీదేవి శపథం చేశారు. తాను ఇప్పుడు స్వతంత్రురాలినని, ఏ పార్టీతోనూ తనకు సంబంధం లేదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం 2024 వరకూ తానే ఎమ్మెల్యేనని, ఏపీలో ఏ రాజ్యాంగం అమల్లో ఉందో తనకు తెలియదన్నారు. ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని, దీనిపై ఇంకా సమయం ఉందని వెల్లడించారు. తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయానని వైఎస్ఆర్సీపీ గుండాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను ఏమైనా మాఫియా డాన్‌నా అని నిలదీశారు. డాక్టర్ సుధాకర్, అచ్చెన్నలు ఎలా చనిపోయారో తెలుసని, వారి మాదిరిగా ఎమ్మెల్యే శ్రీదేవి చనిపోకూడదనే తాను ఇన్నాళ్లు బయటకు రాలేదని అన్నారు. దోచుకో, దాచుకో, పంచుకో అని జగన్ చెబుతున్నారని, తాను అలా చేయబోనని తెలిసి పార్టీ నుంచి తొలగించారని ఆమె ఆరోపించారు.రాజధాని ప్రాంతంలో ఇసుక దందాలు, దోపిడీలకు పాల్పడ్డారని ఉండవల్లి శ్రీదేవి ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాపై దొంగ అనే ముద్ర వేశారని, డబ్బులు తీసుకుని పారిపోయానని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను, తన భర్త ప్రముఖ వైద్యులమని, తమకు రెండు ఆస్పత్రులు ఉన్నాయన్నారు. మహిళను అని చూడకుండా ఇష్టారీతిగా విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. తాను చేసిన తప్పేంటో చెప్పకుండా వేధింపులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ సమయంలో రాజధాని అమరావతి రైతులకు మద్దతుగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. అమరావతి పోరాటంలో ఇప్పటి నుంచి రాజధాని రైతుల పోరాటంలో తాను భాగస్వామిని అవుతానన్నారు. ఎన్నికల సమయంలో అమరావతిలోని ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు.. రాజధాని గురించి తనను అందరూ అడిగితే జగనన్న తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నారని వారికి చెప్పానని అన్నారు. కానీ, గెలిచిన తర్వాత మూడు రాజధానుల తెరపైకి తీసుకొచ్చారని, అమరావతి రైతులు పోరాటం చేస్తుంటే ఆ ప్రాంత ఎమ్మెల్యేగా తాను ఏమీ చేయలేకపోయా. అమరావతిలో జరిగిన అభివృద్ధిలో 10 శాతం కూడా రాష్ట్రంలో జరగలేదని, జగనన్న ఇళ్ల పథకం అనేది ఓ పెద్ద కుంభకోణమని ఆరోపించారు. దళితులపై పెద్ద ఎత్తున దాడులు జరగుతున్నాయని, మహిళలు కూడా రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేదని ఎమ్మెల్యే శ్రీదేవి ధ్వజమెత్తారు. ఇక, సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నుంచే తనకు ప్రాణహాని ఉందని, జాతీయ మానవహక్కుల సంఘాన్ని ఆశ్రయిస్తానని అన్నారు. మానవహక్కుల సంఘం హామీతోనే ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెడతానని ఆమె స్పష్టం చేశారు.