మిలాన్-2024 ఇంటర్నేషనల్ సిటీ పరేడ్‌కు సంబంధించిన ఫుల్ డ్రెస్ రిహార్సల్ ఇవాళ ఆర్కే బీచ్ రోడ్డులో జరగనుంది. దీని కోసం భారత నౌకాదళం, వివిధ దేశాల సిబ్బంది మూడు రోజులుగా బీచ్‌లో రిహార్సల్స్ నిర్వహిస్తున్నారు. యుద్ధ విమానాలు, నౌకల విన్యాసాలు, సిటి పరేడ్ కొనసాగనుంది. ఇందులో 57 దేశాల నేవీ బృందాలు పాల్గోనున్నాయి. ఈమేరకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. 3,536మందితో జిల్లా యంత్రాంగం బందోబస్తు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ఆర్కే బీచ్ మార్గంలో రాకపోకలపై ఆంక్షలు విధించారు.
కాగా, హార్బర్ ఫేజ్‌లో భాగంగా రెండో రోజైన మంగళవారం డాల్ఫిన్ కొండ నుంచి యారాడ కొండ వరకు ఆరోగ్య నడక నిర్వహిస్తారు. పర్యాటక ప్రాంతాల సందర్శనకు పలువురిని ఆగ్రాలో తాజ్‌మహల్ సందర్శనకు తీసుకువెళతారు. యంగ్ ఆఫీసర్లకు మార్గదర్శనం చేస్తారు. హిందూస్థాన్ షిప్‌యార్డులో సబ్మెరైన్లను ఎలా రక్షించాలి అనే అంశంపై ప్రదర్శన ఉంటుంది. సముద్ర విన్యాసాలపై మరోసారి చర్చిస్తారు.
కాగా, నిన్న ఇండియన్ కోస్టుగార్డు, రాష్ట్ర పోలీసులు, సీ కేడెట్లు, నేవల్ కేడెట్లతో పాటు అన్ని దేశాల నేవీల ప్రతినిధులు పాల్గొని మార్చ్ ఫాస్ట్ చేశారు. వివిధ విద్యాలయాలకు చెందిన విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలు చేశారు. కొత్తగా వచ్చిన సీహాక్ హెలికాప్టర్లు, చేతక్‌లు సముద్రంలో మునిగిపోయిన వారిని రక్షించడం, మెరైన్ కమెండోలు పారాచూట్ల సాయంతో ఆకాశంలో చక్కర్లు కొడుతూ సురక్షితంగా బీచ్‌లో దిగడం, జెమిని బోట్ల సాయంతో తీరం చేరడం, అక్కడి శత్రువులపై దాడి చేయడం వంటి ప్రదర్శనలు చేశారు.