Friday, November 22, 2024

వైసీపీలో చేటు తెస్తున్న ‘ వలస ‘ పెత్తనం

ఆంధ్రప్రభ వెబ్ ప్రతినిధి, సెంట్రల్ ఆంధ్ర : డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన పాదయాత్ర పేరేమిటి ? వైఎస్ జగన్మోహనరెడ్డి పాదయాత్రకు ఏ పేరు పెట్టారు ? తర్వాత వైఎస్ షర్మిల ఏ పేరుతో పాదయాత్ర చేపట్టారు ? ప్రజలలోకి వెళ్లిన, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు పేర్లు ఎవరైనా చెప్పగలరా ? ఈ కార్యక్రమాలన్నీ వైఎస్సార్సీపీని అధికార పీఠంపై కూర్చోబెట్టేందుకు దోహద పడినవే. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన కుమారుడైన జగన్మోహనరెడ్డి అహరహం శ్రమించి అలుపెరుగని కార్యక్రమాలు, సుదీర్ఘ పాదయాత్రతో పార్టీకి తిరుగులేని విజయాన్ని సమకూర్చి పెట్టారు. వైఎస్ జగన్మోహనరెడ్డి రెక్కల కష్టమే వైఎస్సార్సీపీకి పటిష్టమైన పునాది. తన కుటుంబాన్నే నమ్ముకున్న నాయకులు, అసంఖ్యాక అభిమానుల కోసం పార్టీ పెట్టాల్సిన అనివార్య పరిస్థితుల్లో జగన్మోహనరెడ్డి ఆ బృహత్తర బాధ్యతను తన నెత్తికెత్తుకున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ, కష్ట నష్టాలను దిగమింగుకుంటూ పార్టీ శ్రేణుల కోసం రాచబాటను ఏర్పరిచారు. అయితే వైఎస్ ఆకాంక్షలు, ఆశయ సాధన క్రమంలో ఆ మార్గం ఎంతవరకు ఉపకరిస్తున్నది ? రాజన్న రాజ్య స్థాపన కోసం జగన్మోహన రెడ్డి సాగిస్తున్న మహాయజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలంటే క్షేత్రస్థాయి నుంచి సంపూర్ణ తోడ్బాటు లభించాలి. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఆ విధంగా వున్నాయా ? అనే విషయం పై ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి.


పార్టీలో వలస పెత్తనం :
తొలుత కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులకు గురైనట్టు ఆరోపణలున్నాయి. దాదాపు దశాబ్దకాలం పాటు ప్రతిపక్ష స్థానంలో ఉండి అధికార పార్టీలపై పోరాటం సలిపిన అసలైన కార్యకర్తలకు ప్రస్తుత పరిస్థితుల్లో సముచిత స్థానం లభించిందా ? అంటే ఎక్కువ చోట్ల నుంచి లేదనే వాదనే విన్పిస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం చాలా నియోజకవర్గాలలో విపక్షాలు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు వలస వచ్చారు. ఆ విధంగా వలస వచ్చిన వారికి వైఎస్సార్సీపీ నాయకులు పలుచోట్ల పెద్ద పీట వేశారని ఆ పార్టీ వర్గాలే ఆరోపిస్తున్నాయి. ఈ కారణంగా పదేళ్ల పాటు ప్రతిపక్ష స్థానంలో ఉండి పోరాటం జరిపిన తమకు అధికారంలోకి వచ్చామన్న ఆనందమే లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఈ విషయంలో ఉన్నత స్థాయి నాయకత్వాన్ని తప్పుబట్టాల్సిన అవసరం లేనప్పటికీ, కొంతమంది నియోజకవర్గ స్థాయి నాయకులు పసుపు సైనికులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. తమ వ్యాపార, స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రయోజనాలను సైతం ఫణంగా పెడుతున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. టీడీపీ నుంచి వచ్చి చేరిన వారిలో కోవర్ట్ లు వుండి వుండవచ్చన్న భయం వైఎస్సార్సీపీ శ్రేణులను వెన్నాడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement