ప్రభుత్వ కళాశాలలపై నమ్మకాన్ని పెంపొందిస్తాం!..
ఎపి మోడల్ ఎడ్యుకేషన్ తో పాఠశాలలకు గతవైభవం!..
ఇంటర్మీడియట్ పాఠ్యప్రణాళికలో సమూల మార్పులు..
మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారిస్తున్నాం..
రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థను తీర్చిదిద్దుతాం.
ప్రజాచైతన్యంతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం..
మంత్రి నారా లోకేష్…
ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించిన మంత్రి లోకేష్…
(ఆంధ్రప్రభ -ఎన్టీఆర్ బ్యూరో) – ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల టీచర్ల కంటే బాగా ప్రభుత్వ పాఠశాలల, కాలేజీల టీచర్లు పాఠాలు చెబుతారని, కానీ ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుందని. దీనికి కారణం ప్రభుత్వ విద్యా వ్యవస్థ పై నమ్మకం లేకపోవడమేనని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల్లో చదువుతున్న వారి సంఖ్య చాలా తక్కువుగా ఉందన్నారు.
ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజీల్లో చేరిపోతున్నారని, కొంత మంది చదువు మానేస్తున్నారని, దీనికి కారణం ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల పై తల్లిదండ్రులకు నమ్మకం లేకపోవడమేనన్నారు. ఆ నమ్మకం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం మన్నారు. ఇంటర్ కాలేజీలు బలోపేతానికి ముందు ప్రభుత్వ పాఠశాలలను ప్రక్షాళన చెయ్యాలిల్ని, అందుకే ఆంధ్రా మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ రూపొందిస్తున్నాట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంపొందించి, పూర్వ వైభవం తీసుకురావడం నా బాధ్యత అని పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లితండ్రులు, టీచర్లే నా బ్రాండ్ అంబాసిడర్లు. దాతలు, పూర్వవిద్యార్థులు, స్వచ్ఛందసంస్థలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు అంతా కలిసి పాఠశాలను, కాలేజీలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సహకరించాలన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలు, స్కూళ్లను తీర్చిదిద్దేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పరు.
సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్లుంది
ఇక్కడ కళాశాలలో వాతావరణం చూస్తుంటే సంక్రాంతి పండుగ వారం ముందే వచ్చిన్నట్టుగా ఉందని మంత్రి లోకేష్ చెప్పరు. విద్యా శాఖ మంత్రి గా నాకు ఒక కోరిక ఉందని, టెన్త్, ఇంటర్ రిజల్ట్స్ ఏప్రిల్ లో వస్తాయని, రిజల్ట్స్ వచ్చిన వెంటనే ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలు ఇచ్చే ర్యాంకుల యాడ్స్ మాదిరిగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న పిల్లల ర్యాంకుల యాడ్స్ వస్తే చూడాలని ఉందన్నారు.
ఆరోజు మా పిల్లలు సూపర్ అని నేను కాలర్ ఎగరేసి చెబుతా, ఈ ఛాలెంజ్ ని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా స్వీకరించాలన్నారు. చదువు సమాజాన్ని మారుస్తుంది అని నేను బలంగా నమ్ముతానని, స్టూడెంట్ లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నరు. మిమ్మల్ని చూస్తుంటే నా ఇంటర్ రోజులు గుర్తొస్తున్నాయని, ఆ రోజులు మళ్లీ రావన్నారు. ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడంతోపాటు బాగా చదువుకొండి అనీ సూచించారు. విద్యార్థి దశలో ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ చాలా ముఖ్యమైందని, ఈరోజుల్లో మినిమమ్ డిగ్రీ ఉంటే కానీ మంచి ఉద్యోగం దొరకదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియేట్ లో చదివే విద్యార్థులు చదువులు మధ్యలో ఆగిపోకూడదని,. ఉన్నత విద్య వరకూ కొనసాగాలన్నారు. ఉపాధ్యాయ వృత్తి చాలా పవిత్రమైనది. ఎంతో మంది జీవితాల్లో చీకటి తొలగించి వెలుగులు నింపుతారన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించాలన్నారు.
నేను కూడా ఒకప్పుడు యావరేజి విద్యార్థినే
మంత్రివర్గ కూర్పు సమయంలో సిఎం అడిగితే విద్యాశాఖ మంత్రిగా కావాలని కోరుకున్నాట్లు మంత్రి లోకేష్ చెప్పారు. కష్టమైన శాఖ ఎందుకు అన్నారని,, మార్పు తేవాలంటే అయిదేళ్లు చాలదు, పదేళ్లు పడుతుందన్నారు. చాలామంది మిత్రులు, సహచరులు పరిశ్రమలు, ఐటి వంటి శాఖలు తీసుకోమని సలహా ఇచ్చారని, కానీ విద్యాశాఖను సవాలుగా స్వీకరించి మార్పు కోసం పనిచేస్తున్నాట్లు చెప్పరు. తాను రాజకీయాల్లోకి వచ్చాక తొలిసారి ఎప్పుడూ గెలవని మంగళగిరి నియోజకవర్గంలో పోటీచేశానని, 1985 తర్వాత గెలవని మంగళగిరిలో తొలిసారి ఓడిపోయా. పట్టుదలతో పనిచేసి రెండో సారి పోటీచేసి రాష్ట్రంలో 3వ అతిపెద్ద మెజారిటీ సాధించినట్లు గుర్తు చేశారు.
దేవుడి ప్రతిఒక్కరికీ పరీక్ష పెడతారని,, జయించే శక్తి కూడా భగవంతుడే ఇస్తాడన్నారు. పరీక్షలో ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటున్నారని, సప్లిమెంట్ రాసుకొని పాస్ కావచ్చు. టెన్త్ వరకు నేను కూడా యావరేజి విద్యార్థిని. 10వతరగతి పాసయ్యాక ఇప్పటి మంత్రి నారాయణను పిలచి నన్ను మెరుగ్గా తీర్చిదిద్దాలని చెప్పారని, ఆయన నన్ను ఉదయం నుంచి రాత్రి వరకు చదివించి నన్ను ఉత్తమంగా తీర్చిదిద్దనట్లు చెప్పరు. పట్టుదలతో విద్యార్థులు చదువు కొనసాగించి జీవితంలో ఉన్నతస్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాబోయే ఏప్రిల్ మీతోపాటు నాకు కూడా పరీక్ష లాంటిదని,. మెరుగైన ఫలితాలు సాధించి మంచిపేరు తీసుకురండన్నారు.
ఇంటర్మీడియట్ పాఠ్యప్రణాళికలో సమూల మార్పులు
ఇంటర్మీడియట్ పాఠ్యప్రణాళికలో సమూల మార్పులు తెస్తున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. ఇంటర్నల్ అస్సేస్మెంట్ పక్కాగా చేస్తున్నాం అని, ఎంసెట్, నీట్ మెటీరియల్ కూడా వచ్చే ఏడాది నుండి ఇస్తున్నట్లు తెలిపారు. పాస్ పర్శంటేజ్ పెంచడానికి కాలేజ్ టైమింగ్ గంటన్నర పెంచాం అని, విద్యార్థుల సామర్ధ్యాలను బట్టి మూడు గ్రూపులుగా విభజించి ఒక కేర్ టేకర్ ను ఏర్పాటు చేసి స్టడీ అవర్స్ పెడుతున్నట్లు చెప్పారు.క్వశ్చన్ బ్యాంక్స్ అందజేశాఅని,. ఐఐటి మద్రాస్ వారి సహకారంతో పైలెట్ ప్రాజెక్టు చేస్తున్నట్లు చెప్పరు. 29 ఇంటర్మీడియేట్ కాలేజీల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం. క్రమం తప్పకుండా పేరెంట్ – టీచర్స్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పరు. టీచింగ్ క్వాలిటీ పెంచడానికి అకడమిక్ గైడెన్స్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు,. కాలేజీలకు మౌలిక వసతులు, అకడమిక్ పెరఫామెన్స్ ఆధారంగా ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తున్నాం విద్యార్థులు బాగా చదువుకొని ఉద్యోగం సాధిస్తే కుటుంబం పరిస్థితి మారిపోతుందన్నారు.
రాజకీయాలకు అతీతంగా విద్యావ్యవస్థ
విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలని నేను మొదటి నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. తాను మంత్రి అయిన వెంటనే రాజకీయ నాయకుల ఫోటోలు, రంగులు తీసేయమని ఆదేశాలు జారీ చేసినట్లు గుర్తు చేశారు. స్కూల్స్ లో ఒక్క జాబ్ మేళాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు నిర్వహించకూడదు అని నిర్ణయం తీసుకుని,. రాజకీయ కార్యక్రమాలకు పిల్లల్ని తీసుకోని వెళ్ళకూడద ని గట్టిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా మన చరిత్రను, సంస్కృతిని గుర్తుచేసేలా విద్యారంగంలో విశేష సేవలందించిన వ్యక్తుల పేర్లను ప్రభుత్వ పథకాలకు పెట్టి వాటిని సమర్థవంతంగా ముందుకు తీసుకెళుతున్నట్లు తెలిపారు. 1 నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ. 944 కోట్లతో ఉచితంగా“సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్పంపిణీ చేశాం అని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం క్రింద లక్షలాది మంది విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన, ఆయా ప్రాంతాల ఆహార అలవాట్లను గౌరవిస్తూ పౌష్టికాహారం అందిస్తున్నట్లుతెలిపారు. టీచర్లు చదువు మాత్రమే చెప్పాలనీ, ఇతర పనులు, పనికిమాలిన యాప్స్ తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పారదర్శకంగా మెగా డిఎస్సీ నిర్వహిస్తాం
అధికారంలోకి వచ్చిన వెంటనే 16,347పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించినట్లు మంత్రి లోకేష్ తెలిపారు. ఇటీవల టీచర్ ఎలిజబులిటీ టెస్ట్ (టెట్) కూడా నిర్వహించాం అని, ఈ క్రమంలో మెగా డీఎస్సీని పారదర్శకంగా నిర్వహించబోతున్నట్లు తెలిపారు. కేజీ టూ పీజీ పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తెస్తున్నట్లు, చదువు తో పాటు నైతిక విలువలు చాలా ముఖ్యం అని,. మహిళల్ని గౌరవించడం చిన్న వయస్సు నుండే నేర్పించాలన్నారు. అంతకుముందు సమాజంలో మార్పు రావాలనీ, మహిళలను తక్కువచేసి మాట్లాడే పోకడలు పోవాలన్నారు. ఆడ, మగ సమానం అనే భావన కలిగేలా ప్రత్యేక పాఠాలు తీసుకొస్తాం అన్నారు. పిల్లల్లో నైతిక విలువలు పెంచడం కోసం నైతిక విలువల సలహాదారునిగా చాగంటి కోటేశ్వర రావు గారిని నియమించాం అన్నరు. వారి మార్గనిర్దేశకత్వంలో ప్రత్యేక పాఠాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. లైఫ్ స్కిల్స్, సివిక్ అవేర్నెస్, ఆటలు, పాటలు నేర్పించాలని నిర్ణయం తీసుకున్నమని,. విద్యార్థులు చదువుతో పాటు అన్ని విషయాల్లో నంబర్ 1 గా ఉండాలి అనేది మన లక్ష్యం కావాలన్నారు. విద్యార్థుల సామర్ధ్యాలను తెలుసుకోవడానికి డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చెయ్యబోతున్నట్లు చెప్పర. ఒకప్పుడు విజన్ 2020 అంటే నవ్వుకున్నాం అని, ఈరోజు అదే నిజమైందన్నారు. విజన్ 2047 తీసుకొచ్చారనీ,. ఆ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రిగా టిసిఎల్, గూగుల్ వంటి ఐటి కంపెనీలు, రాయలసీమకు ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తెస్తున్నట్లు గుర్తు చేశారు. ఆ కంపెనీల్లో పనిచేసే మానవవనరులు అవసరం . జాబ్ సీకర్స్ గా గాకుండా జాబ్ క్రియేటర్స్ గా మీరంతా తయారు కావాలనీ ఆకాంక్షించారు. ఎంటర్ ప్రెన్యూర్స్ ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు.
లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి
స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ పై దృష్టి పెట్టినట్లు నారా లోకేష్ వెల్లడించారు. అన్ని స్కూల్స్, కాలేజిల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యతనిస్తున్నామని. టేబుల్స్ , లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్, త్రాగునీరు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పర. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ లో ప్రభుత్వ కాలేజీల్లో చేరాలనేది తన కోరికగా వెల్లడించారు. ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ను సమూల ప్రక్షాళన చేస్తున్నామని,. గత ప్రభుత్వం ఇంటర్మీడియేట్ విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం ఆపేసిందనీ, మధ్యాహ్న భోజన పథకం ఆపేసిందన్నారు. తాను మంత్రి అయ్యిన వెంటనే నిరుపేద కుటుంబాల పిల్లలు మన ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల్లో చదువుతున్నారనీ,. ఖచ్చితంగా వారికి టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటించారు. సుమారుగా 30 కోట్లు ఖర్చు చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర స్టూడెంట్ కిట్స్ పంపిణీ చేసామన్నారు. ఇప్పుడు 475 ప్రభుత్వ ఇంటర్మీడియేట్ కాలేజీల్లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం కోసం ప్రతి ఏడాది సుమారుగా 86 కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ వల్ల కలిగే విపరిణామాలను వివరిస్తూ డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. డ్రగ్స్ కు అలవాటుపడితే సినిమా ట్రైలర్ లో ముఖేష్ మాదిరిగా బతుకు దుర్భరంగా మారుతుందనీ, అనేక సందర్భాల్లో పిల్లలు తల్లిదండ్రులపై తిరగబడి దాడిచేస్తున్నారనీ, చంద్రగిరిలో పాదయాత్ర సమయంలో ఓ తల్లి తన బిడ్డ గంజాయికి బానిసైందని కన్నీళ్ల పర్యంతమైందనీ గుర్తు చేశారు. అందుకే ప్రభుత్వం వచ్చాక ఈగల్ టాస్క్ ఫోర్సు పెట్టాం మని,. మీరంతా భాగస్వామ్యం కావాలన్నారు. ప్రజాచైతన్యంతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతాం అని, డ్రగ్స్ వాడేవారిని చైతన్యపర్చండన్నారు. డ్రగ్స్, గంజాయి కి ఎడిక్ట్ అవ్వడం వలన ఒక తరం నాశనం అయ్యే ప్రమాదం ఉందన్నారు. అందుకే డ్రగ్స్ పై యుద్ధం చేస్తున్నామని మంత్రి లోకేష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరావు, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, పాఠశాల విద్య కార్యదర్శి కోన శశిధర్, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు, కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబు, కళాశాల ప్రిన్సిపాల్ సిఎస్ఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.