Tuesday, November 26, 2024

మోటార్లకు మీటర్లు.. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లపై సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ : వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించే విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో అన్ని జిల్లాల్లోని వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు జగన్‌ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. వ్యవసాయ పంపుసెట్ల వినియోగం కోసం ఉపయోగించే మోటార్లకు మీటర్లు బిగించే పైలట్‌ ప్రాజెక్టు శ్రీకాకుళంలో విజయవంతమైందని ప్రకటించిన జగన్‌ ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు అమర్చే పైలట్‌ ప్రాజెక్టు సత్ఫలితాలనిచ్చింది..దాదాపు 30 శాతం విద్యుత్‌ ఆదా అయింది..గతంలో పోల్చుకుంటే కనెక్షన్లు పెరిగినా 33.75 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ మిగులు ఏర్పడింది..రైతులు వాడని కరెంటును ఉచిత విద్యుత్‌ పేరుమీద ఇప్పటివరకూ లెక్క కడుతున్నారు..మీటర్ల కారణంగా వీటన్నింటికీ చెక్‌పడే పరిస్థితి వచ్చింది.

వ్యవసాయ విద్యుత్‌ వినియోగంపై పారదర్శక వ్యవస్థ ఏర్పడిందని జగన్‌ వ్యాఖ్యానించారు. ప్రత్యేకించి రైతులకు నాణ్యమైన కరెంటు- అందుతోంది..సిబ్బందిలో కూడా జవాబుదారీతనం పెరిగింది..దీనివల్ల అన్ని జిల్లాల్లో నాణ్యమైన విద్యుత్‌ అందుబాటు-లోకి రావటం వల్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చే అంశాన్ని కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం ఉంది..ఇప్పటికే దీనిపై దుష్ప్రచారం ప్రారంభించారు..ఎవరెన్ని రాజకీయాలు చేసినా మీటర్లపై రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలి..మీటర్లు వల్ల ఒనగూరే ప్రయోజనాలపై విస్తృత ప్రచారం చేపట్టాలి..రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రతి రైతుకు దీనిపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాలని జగన్‌ అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement