Friday, November 22, 2024

విశాఖలో మెగా ప్రాజెక్ట్.. మార్చి వ‌ర‌కు టార్గెట్…

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌) : మహావిశాఖనగరంలో మరో మెగా ప్రాజెక్టు నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మేరకు మహావిశాఖ నగరపాలక సంస్థ, స్మార్ట్‌ సిటీ కార్పొరేషన్లు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. సుమారు రూ.850 కోట్లతో నగరంలో మురుగునీటిని శుద్ధి చేసే ప్లాంట్‌ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు తొలివిడత పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి కావస్తున్నాయి. ప్యాకేజీ -1 కింద పెందుర్తి, చినముషిడివాడ, వేపగుంట తదితర శివారు ప్రాంతాలను కలుపుకోగా, ప్యాకేజీ -2 కింద గాజువాక, పెదగంట్యా, మల్కాపురం తదితర ప్రాంతాలను చేర్చారు.

ఇలా రెండు ప్యాకేజీల పరిధిలో సుమారు 5 లక్షల జనాభా నివాసముంటున్నట్లు గుర్తించారు. ఆయా ప్రాంతాల నుంచి మురుగునీటిని నేరుగా నరవలోని 108 ఎంఎల్‌డి మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ వద్దకు తీసుకువస్తారు. ఇక్కడ అధునాతన యంత్రాలుతో ఆ మురుగునీటిని శుద్ధి చేసి పూర్తిగా మంచినీటిగా మార్పు చేస్తారు. అనంతరం ప్రతీరోజు 78 ఎంఎల్‌డి మంచినీటిని రెండు పరిశ్రమలకు సరఫరా చేస్తారు.

అందులో హెచ్‌పీసీఎల్‌కు 35 ఎంఎల్‌డి నీటిని పంపిస్తారు. అందుకుగాను ఒక కిలోలీటరు నీటికి రూ.57 చొప్పున వసూలు చేస్తారు. ఇక మరో 33 ఎంఎల్‌డి నీటిని విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించి కిలో లీటరు నీటికి రూ.35 చొప్పున వసూలు చేస్తారు. ప్రస్తుతం ప్యాకేజీ-1 పనులు వేగవంతంగా సాగుతున్నాయి. తదుపరి ప్యాకేజీ -2 గాజువాక పనులు రెండోదశలో 2023 మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయి. ఈ ప్రాజెక్టు బాధ్యతను టాటా కన్సల్టెన్సీ 15 ఏళ్ల పాటు నిర్వహిస్తుంది. ప్రాజెక్టు అంచనా రూ.750 కోట్లు కాగా అన్ని ఖర్చులతో కలిసి రూ.850 కోట్లు కానుందని అధికారులు అంచనా వేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement