- 1000కి పైగా ఉద్యోగాలు
- తరలివస్తున్న టాప్ -50 కంపెనీలు
హోంమంత్రి ఇలాకాలో రేపు (శనివారం) మెగా జాబ్ మేళా జరగనుంది. యువతకు 1000కి పైగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు టాప్-50 కంపెనీలు తరలివస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఏపీలో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలందించాలన్న లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం సంకల్పించుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
తన సొంత నియోజకవర్గం పాయకరావుపేట స్పేసెస్ డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగపరచుకోవాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఉదయం 9గం.లకు ప్రారంభమయ్యే మెగా జాబ్ మేళాలో ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నట్లు తెలిపారు.
పదో తరగతి నుంచి పీజీ వరకూ ఏ అర్హత ఉన్నా ఈ మెగా జాబ్ మేళాలో పాల్గొని తగిన ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చని హోంమంత్రి స్పష్టం చేశారు.