Sunday, November 24, 2024

AP | ఉద్యోగాలు అడిగితే పోలీస్ స్టేషన్ కు పంపుతారా : షర్మిల

మంగళగిరి, ప్రభ న్యూస్ : దగా డిఎస్సీ కాదు మెగా డీఎస్సీ అమలు చేయాలని అడుగుతూ, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తే గాయపరిచి పోలీస్ స్టేషన్ కు తరలిస్తారా అంటూ ఏపీ సీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల నేతృత్వంలో ఏపీ సచివాలయాన్ని ముట్టడించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా షర్మిల తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పోలీసుల తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్టేషన్ ఆవరణలోనే నిరసన తెలిపారు. అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మెట్రో తీసుకురావడం చేతకాలేదు ఉద్యోగాలు ఇవ్వటం చేతకాలేదు కానీ జర్నలిస్టులను కొట్టడం ప్రశ్నిస్తే గాయపరచడం పోలీస్ స్టేషన్లో పెట్టడం మాత్రం చేతనైంది అని మండిపడ్డారు. ఇది నమ్మించి వంచన చేయటం కాదా అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేయాలని అడిగారని అన్నారు.

అధికారంలోకి వచ్చిన ఆయన వైఎస్ఆర్సిపి ఎంపీల చేత ఎందుకు రాజీనామాలు చేయించడం లేదని సూటిగా ప్రశ్నించారు.బిజెపికి ఊడిగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. భర్తీ చేస్తామన్న రెండు లక్షల 30 వేల ఉద్యోగాలు లో ఎన్ని భర్తీ చేశారని ప్రశ్నించారు. వాలంటీర్లు, సచివాలయాల ఉద్యోగుల పేరుతో తమ సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామన్న ఉద్యోగాలను భర్తీ చేయలేదని హామీ ఇచ్చిన రెండు లక్షల 30 వేల ఉద్యోగాలలో కేవలం 2,457 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని అంటే రెండు శాతం కూడా భర్తీ చేయలేకపోయారని అన్నారు.

మెగా డీఎస్సీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీ అని అన్నారు. ఆయన వారసులుగా చెప్పుకుంటున్న వారు నేడు మెగా డీఎస్సీ ని అమలు చేయకుండా తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని సాధ్యం కానీ ఆంక్షలు పెట్టి దగా డిఎస్సి తీసుకువచ్చారని అన్నారు.జాబ్ క్యాలెండర్లు విడుదల చేస్తామని చెప్పి అలా చేయకుండా సాక్షి క్యాలెండర్ విడుదల చేశారని ఎద్దేవా చేశారు. 23 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందు కోసం వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు.

ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలన్నీ ఎన్నికల తర్వాత నీటి మీద రాతలు అయిపోయాయని పేర్కొన్నారు. ఆయా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. 47 మంది నాయకులను వివిధ ప్రాంతాల నుంచి పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి స్టేషన్ కు తరలించారు. సుమారు రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్ లో ఉంచిన పోలీసులు అనంతరం విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement