ఏపీలో భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రూ.9.45 కోట్ల వరకు విరాళం అందింది. తాజాగా మెగా డాటర్ నిహారిక కూడా సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఏపీ వరద బాధితులకు నిహారిక వ్యక్తిగతంగా రూ.5 లక్షల విరాళం ప్రకటించింది. ముఖ్యంగా బుడమేరు నది వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన పది గ్రామాలపై నిహారిక ప్రత్యేకంగా దృష్టి సారించింది.
నిహారిక ఆర్థిక విరాళాన్ని ప్రకటిస్తూ… “బుడమేరు వాగు ముంపుతో విజయవాడ రూరల్ ఏరియాలో అనేక గ్రామాలు నీట మునగడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతుండడం నాకు చాలా బాధ కలిగించింది. అందుకే నావంతు సాయంగా వరద ముంపునకు గురైన పది గ్రామాల్లో ఒక్కో గ్రామానికి యాభై వేలు చొప్పున ఐదు లక్షలు రూపాయలు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.