న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని, అడ్డుకునే సభ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ కేంద్రాన్ని కోరింది. సోమవారం మధ్యాహ్నం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. సీఎం జగన్ ఇటీవల ప్రధానమంత్రికి సమర్పించిన వినతి పత్రంలోని అంశాలను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. ఎల్ఐసి, బీపీసీఎల్, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నట్టు తెలియజేశారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు జీఎస్టీ నష్టపరిహారాన్ని మరో ఐదేళ్ళ పాటు పొడిగించాలని కేంద్రాన్ని కోరారు.
మధ్యతరగతి ప్రజలకు స్వల్ప మొత్తంతో ఆరోగ్య భీమా వర్తింపజేయాలని సూచించారు. తక్షణమే జనాభా లెక్కల సేకరణ చేపట్టాలని, అందులో కులాల వారి గణన కూడా చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న 10 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలన్నారు. నిర్ణీత కాల వ్యవధిలో నియామకాలు పూర్తి చేసేలా యూపీఎస్సీ తరహాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీకీ సైతం చట్టబద్ధత కల్పించాలని సూచించారు.
మరోవైపు ‘పెగాసెస్’ స్పైవేర్ అంశం గురించి వివిధ విపక్ష సభ్యులు చర్చకు పట్టుబట్టగా, వైఎస్సార్సీపీ తరఫున విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యవహారం సామాన్య ప్రజలకు సంబంధించింది కాదని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాలని తాము కోరుతున్నామని, అదే సమయంలో ప్రజా సమస్య కాని అంశాల గురించి సభా సమయం వృధా కాకుండా చూడాలని సూచించారు. అలాంటి అంశాల కోసం సభ కార్యాకలాపాలను అడ్డుకునేవారిని ఏమాత్రం ఉపేక్షించకుండా క్రమశిక్షణా చర్యలు చేపట్టాలని విజయసాయి రెడ్డి అన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..