కరోనా సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ అవసరం అధికంగా ఉందని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీఎం ఆళ్ల నాని అన్నారు. అందుకే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఆక్సిజన్ రవాణా పర్యవేక్షణ కోసం నియమించామని తెలిపారు. కోవిడ్ కట్టడి, వ్యాక్సినేషన్‌తో పాటు తదితర సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం అయ్యింది. అనంతరం మంత్రి ఆళ్ల నాని మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని ఇప్పటికే తాము ప్రధానికి లేఖ రాశామని, ప్రతి జిల్లాలో కూడా ఆక్సిజన్ ప్లాంట్స్ సిద్ధం చేస్తున్నామని వివరించారు. ఆక్సిజన్ వృధా కాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు. ఆక్సిజన్, రెమిడెసివిర్, బెడ్స్, హోమ్ ఐసోలేషన్, కోవిడ్ కేర్ సెంటర్లపై తాము చర్చించామని వెల్లడించారు. తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చోటు చేసుకున్న సంఘటనలు పునరావృత్తం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించామని పేర్కొన్నారు.
ఆక్సిజన్ సరఫరాకు స్పష్టమైన మార్గదర్శకాలను సీఎం జగన్ తమకు సూచించారని, ఆక్సిజన్ పైప్ లైన్లను వెంటనే వెరిఫై చేయాలని తాము అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఆక్సిజన్ డిమాండ్ ను బట్టి పంపిణీకి ఏర్పాట్లు చేస్తామన్నారు. రాష్ట్రంలో 11 వేల ఆక్సిజన్ బెడ్స్ ఇప్పటికే సమకూర్చామన్నారు. ప్రస్తుతం 590 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్‌ను వాడుతున్నామని ఆళ్ల నాని చెప్పారు. ఈ నిల్వ సామర్థ్యాన్ని 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 49 మినీ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిందన్నారు. ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీరే అవకాశముందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వృథా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో మానటరింగ్ సెల్ లు ఏర్పాటు చేశారన్నారు. ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ మోనటరింగ్ సెల్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరులో జిల్లాలో మోనటరింగ్ సెల్ పర్యవేక్షణతో 4 నుంచి 5 టన్నుల ఆక్సిజన్ ను ఆదా చేసినట్లు ఆయన తెలిపారు. ఆక్సిజన్ మేనేజ్ మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోరారు.
వ్యాక్సినేషన్ విషయంలో ప్రతిపక్షాలు కావాలని రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి ఆళ్ల నాని తీవ్రంగా మండిపడ్డారు. వ్యాక్సిన్ కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వ చేతిలోనే ఉందని చంద్రబాబు అవాస్తవాలు మాట్లాడుతున్నారని, ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఉచిత వ్యాక్సినేషన్ కు రూ.1600 కోట్లు వ్యయమవుతుందని, ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్ పై ప్రతిపక్షాలు అవాస్తవాలు చెబుతూ, ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని, ఇది సరికాదని ఆయన అన్నారు. ఒకే రోజు 60 లక్షల టీకాలు పంపిణీ చేసి, వ్యాక్సినేషన్ లో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇదీ వ్యాక్సినేషన్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నద్ధతకు నిదర్శమని కొనియాడారు. తాము నిర్ణయించిన కోటా మేరకే రాష్ట్రాలకు వ్యాక్సిన్లు అందజేస్తున్నామని సుప్రీం కోర్టులో వేసిన అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రెండో డోస్ తీసుకునేవారికి వలంటీర్లు, ఎస్ఎంఎస్ ల ద్వారకా సమాచారమిచ్చి రద్దీని నివారించామన్నారు. టీకా పంపిణీ కేంద్రాల్లో షామియాన్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.
రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా అడ్డుకున్నామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. రెమిడెసివిర్ వినియోగంలో అక్రమాల నివారణకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో బెడ్ల సంఖ్య పెంచుతున్నామన్నారు. ఆ సెంటర్లలో కరోనా బాధితులకు పౌష్టికాహారం, అవసరమైన మందులు పంపిణీ చేయడంతో పాటు పారిశుద్ధ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులకు అవసరమైన కిట్లు అందజేస్తున్నామన్నారు. 104 కాల్ సెంటర్ కు వచ్చే ప్రతి ఫోన్ కాల్ కూ స్పందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, కరోనా నియంత్రణకు సీఎం జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు
ఇదీ చదవండి: 44 దేశాల్లో ఇండియన్ కరోనా వెరియంట్!: WHO