శ్రీకాకుళం, ఏప్రిల్ 19 : అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి ఎంతో గొప్పదని, అటువంటి వైద్యవృత్తిని అంకితభావంతో చేపట్టాలని వైద్య విద్యార్థులకు మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలులోని జెమ్స్ ఆసుప్రతిలో ఈరోజు 2017-2023 బ్యాచ్ వైద్య విద్యార్థులకు పట్టాలు అందజేసే కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కష్టపడి పనిచేస్తే ఇష్టంగా అనుకున్నవి సాధించుకోవచ్చునని విద్యార్థులకు సూచించారు. రోగి పుస్తకంతో సమానమని, ప్రతీ రోగి వైద్యునికి ఎంతో జ్ఞానాన్ని అందిస్తారని, ఆ దృష్టితో రోగులకు వైద్యసేవలు అందజేయాలని చెప్పారు. రోగులకు అనవసర పరీక్షలు రాయకుండా, వారితో మాట్లాడి అవసరం మేరకే మందులు రాయాలని చెప్పారు. విదేశాలకు వెళ్లండి… జ్ఞానాన్ని పెంచుకొని తిరిగి మన దేశానికే రావాలన్నారు. వ్యాధి వచ్చిన తరువాత వైద్యం అందించడం కాదు.. వ్యాధుల బారిన పడకుండా యువతను చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత వైద్యులు, వైద్య విద్యార్థులపైనే ఉందన్నారు . ప్రస్తుత కాలంలో క్యాన్సర్, డయాబెటిస్, స్థూలకాయం వంటివి అధికంగా ప్రబలుతున్నాయని ఈ వ్యాధులపై యువతను చైతన్యం చేసే దిశగా ప్రయత్నం చేయాలన్నారు. ఇంటింటికి వెళ్లి రోగాల పట్ల ప్రజలకు వివరించి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. వైద్య వృత్తిని చేపట్టడమే నోబెల్ బహుమతి పొందడంతో సమానమని వివరించారు. గతంలో విద్య, వైద్యాన్ని అంకితభావంతో ఉచితంగా అందించే వారని, కానీ నేడు అవి వ్యాపారంగా మారిపోతుండడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గొప్ప మానవత, జాతీయభావంతో వైద్యసేవలు అందజేయాలని చెప్పారు. యువత రాజకీయాల్లోకి రండి… వ్యవస్థను బాగు చేయండి… కానీ అవినీతి రాజకీయాల్లో భాగస్వామ్యులు కాకండని వివరించారు. నాయకుడు ప్రజల్లో తిరగాలి… ప్రజా జీవనంలో మమేకం కావాలని అటువంటప్పుడే ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన కలుగుతుందన్నారు.
భారతీయ సంప్రదాయాలను గౌరవించాలని,ప్రపంచానికి విశ్వగురువు భారతదేశమని, భారతీయ సంప్రదాయాల వైపు తిరిగి వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త వ్యాధులపై అధ్యయనం చేస్తూ పరిష్కారాలు కనుగొంటూ రోగికి చైతన్యం చేస్తూ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని సూచించారు. జెమ్స్ సేవలు అమోఘమని, ఈ ఆసుపత్రి అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవన్నారు. జిల్లాలో కిడ్నీ వ్యాధులు అధికంగా ఉన్నాయని, వారికి జెమ్స్ అత్యత్తుమంగా డయాలసిస్ వైద్యాన్ని అందిస్తున్నారన్నారు. గుండెకు సంబంధించిన పూర్తి వైద్య సేవలు అందిస్తున్న ఏకైక సంస్థ జేమ్స్ కావడం గర్వకారణం అని అన్నారు. వైద్యపరీక్షలు నిర్వహిస్తున్న ఏకైక ఆసుప్రతి జెమ్స్ అని చెప్పారు. జెమ్స్‌లో వైద్యం వ్యాపారంగా కాకుండా అంకిత భావంతో వైద్యం అందించడం అభినందనీయ మని కొనియాడారు. సిఎండి కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్ బొలినేని భాస్కర్ రావు మాట్లాడుతూ.. క్రమశిక్షణతో కూడిన విద్య ఉన్నత శిఖరాలకు తీసుకువెళుతుందని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు అందించే వైద్య సేవలు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును చైర్మన్ భాస్కర్ జ్ఞాపక అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సుధీర్, ప్రిన్సిపాల్ లక్ష్మీలలిత, సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, సీఈఓ బొలినేని ఆద్విక్, సీఎఓ స్వర్ణ రామ్మోహన్, కిమ్స్ వైద్యులు గూడెన సోమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు పట్టాలు అందజేశారు..