విశాఖపట్టణం, ఆంధ్ర ప్రభ బ్యూరో : కోర్టులు – మీడియా పరస్పర సహకారంతో, సమన్వయంతో పని చేయాల్సి ఉందని, జవాబుదారీ తనంతో కూడిన పనితీరును ప్రదర్శిస్తూ, బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలని సుప్రీం కోర్టు, వివిధ హైకోర్టుల న్యాయమూర్తులు పేర్కొన్నారు.
జ్యుడీషియరీ అండ్ మీడియా అనే అంశంపై జరిగిన మేథోపరమైన చర్చలో పలు అంశాలపై వారి ఆలోచనలు పంచుకున్నారు. ట్రయిల్ కోర్టులో, ఇతర న్యాయపరమైన అంశాల్లో మీడియా పాత్ర ఎలా ఉండాలి, దాని పరిధి, పరిమితులపై సుదీర్ఘంగా చర్చించారు.
గతంలో జరిగిన సంఘటలను సోదాహరణంగా వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భావితర జడ్జీలు ఎలా వ్యవహరించాలి అనే కోణంలో విశ్లేషణ చేశారు. పలు అంశాలపై సీనియర్ న్యాయమూర్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
విశాఖపట్టణం.. ఆంధ్ర ప్రభ బ్యూరో
విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన సౌత్ జోన్-2 రెండు రోజుల జ్యుడీషియల్ ప్రాంతీయ సదస్సులో భాగంగా రెండో రోజు ఆదివారం జ్యుడీషియరీ అండ్ మీడియా, అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్ థ్రూ ఎమెర్జింగ్ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అనే అంశాలపై చర్చ నిర్వహించారు.
ముందుగా సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన కోర్టులు – మీడియా పాత్ర అనే అంశంపై చర్చ జరిగింది. రిసోర్స్ పర్సన్లుగా కేరళ హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మౌషిమి భట్టాచార్య వ్యవహరించారు.
పీపీటీ ద్వారా పలు అంశాలపై వివరణ ఇచ్చారు. అనంతరం అడ్వాన్సింగ్ జ్యుడీషియల్ గవర్నెన్స్ పై జస్టిస్ కురియన్ జోసెఫ్ అధ్యక్షతన చర్చ జరగ్గా… కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.ఎం. ముస్తాక్యు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎం. సుందర్ రిసోర్స్ పర్శన్లుగా వ్యవహరించారు. కేరళ హైకోర్టులో అనుసరిస్తున్న ఏఐ విధానాలను వివరించారు.
విశ్వసనీయతను కలిగి ఉండాలి : జస్టిస్ కురియన్ జోసెఫ్
మీడియా అందించే సమాచారం విశ్వసనీయతను కలిగి ఉండాలని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ పేర్కొన్నారు. అదే పరస్పర సహకారానికి ప్రామాణికంగా నిలుస్తుందన్నారు. రెండు అంశాలపై జరిగిన చర్చా వేదికలను ప్రారంభించిన ఆయన కోర్టు వ్యవహారాల్లో, సమాచార చేరవేతలో మీడియా పాత్ర, తీర్పులు, ఇతర ప్రొసీజరల్ అంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాత్ర గురించి సుదీర్ఘంగా మాట్లాడారు.
వాటి ఆవశ్యతను తెలుసుకోవాలని, వినియోగంపై విశ్లేషణ చేసుకోవాలని పేర్కొన్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాలు ప్రస్తుతం పోషిస్తున్న పాత్రపై అవగాహన కలిగి ఉండటంతో పాటు అప్రమత్తంగా ఉండాలని న్యాయమూర్తులకు సూచించారు.
ప్రాంతీయ సదస్సులో భాగంగా కేరళ హైకోర్టు న్యాయమూర్తి దేవన్ రామచంద్రన్ ఫోర్త్ ఎస్టేట్ గా ప్రాచుర్యం సంపాదించుకున్న మీడియాలో ఎన్నో మార్పులు సంతరించుకున్నాయని, కొన్ని సందర్భాల్లో కోర్టులను, కోర్టు పరిధిలోని అంశాలపై ప్రభావం చూపిస్తున్నాయన్నారు.
ప్రజల గొంతుకగా పని చేస్తున్న మీడియా మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉందని పేర్కొన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను వార్తలుగా రాయకూడదని, నిజాలను నిర్ధారించుకొని వాస్తవాలను వార్తలుగా ప్రచురించాలని హితవు పలికారు.
సున్నితమైన అంశాల్లో ఆచితూచి వ్యవహరించాలని, పరిస్థితులను అర్ధం చేసుకొని నడుచుకోవాలని సూచించారు. ట్రయల్ అంశాలను ముందుగా బహిర్గత పరచకూడదని, ప్రతికూల ప్రభావాలను చూపరాదని హితవు పలికారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి మౌషిమి భట్టాచార్య మాట్లాడుతూ జ్యుడీషియరీ విభాగంలో పని చేసే వారంతా మీడియాపై, అక్కడ జరిగే పరిణామాలపై అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.
కోల్ కతాలో జరిగిన ఆర్జీకర్ ఆసుపత్రి ఘటన, ఇతర ఘటనల్లో మీడియా వ్యవహరించిన తీరును ప్రస్తావించారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియాకున్న పరిమితుల గురించి ఇరు వర్గాలూ తెలసుకోవాల్సి ఉందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీ అంశాలను వివరిస్తూ భవిష్యత్తులో వాటిని ఉదాహరణగా తీసుకొని జాగ్రత్త వహించాలన్నారు.
కోర్టు వ్యవహారాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పాత్రపై మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి ఎం. సుందర్ విశ్లేషణ చేశారు. ఏఐ అనేది న్యాయమూర్తులకు సహకారిగా మాత్రమే ఉంటుందని, ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయమూర్తులు ఏఐ టెక్నాలజీని పరిగణనలోకి తీసుకోవచ్చని, కానీ దానినే తుది నిర్ణయంగా, అంతిమ ప్రామాణికంగా తీసుకోరాదని సూచించారు.
కేరళ హైకోర్టు న్యాయమూర్తి ఎ.ఎం. ముస్తాక్యు బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి మాట్లాడారు. కేరళ హైకోర్టులో అనుసరిస్తున్న ఏఐ టెక్నాలజీ గురించి పీపీటీ ద్వారా వివరించారు. ఈ- కోర్టు రూముల గురించి, సాంకేతిక సిబ్బంది సహకారం గురించి తెలిపారు. కేరళలో కోర్టు వ్యవహారాల నివేదికలను రూపొందించేందుకు ఏఐ, గూగల్ నోట్ బుక్ సాయం తీసుకుంటున్నామని వెల్లడించారు.
ఏఐ వినియోగంలో సానుకూల దృక్ఫథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సదస్సు ముగింపు సందర్బంగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ ప్రెసిడెంట్ జస్టిస్ రవినాథ్ తిల్హారీ వందన సమర్పణ చేశారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.వి. శేషమ్మ, ఇతర సీనియర్ న్యాయమూర్తులు, హైకోర్టు, జిల్లా కోర్టుల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.