Friday, November 22, 2024

రోడ్ల నాణ్యత మెరుగుపరిచేందుకు చర్యలు : రోడ్లు భవనాలు, వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టి.కృష్ణబాబు

పుట్టపర్తి : జాతీయ రోడ్లు విస్తరణ అమల్లో భాగంగా సుమారు 40 వేల ఎకరాలు నాలుగు నెలల్లో భూ సేకరణ పూర్తి చేస్తామని రోడ్లు భవనాలు, వైద్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ టి.కృష్ణబాబు పేర్కొన్నారు. శనివారం ఉదయం శ్రీ సత్య సాయి జిల్లాలోని పలు ప్రాంతాల్లో రోడ్లను పరిశీలించి మధ్యాహ్నం రోడ్ల నిర్మాణాలపై కాంట్రాక్టర్లు, ఇంజినీర్లతో సమావేశం నిర్వహించేందుకు ప్రిన్సిపల్ సెక్రెటరీ జిల్లా కలెక్టరేట్ కు విచ్చేశారు. అప్పటికే జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై కలెక్టర్ తో భేటీ అయిన మాజీ మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిలు కృష్ణబాబు నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రెటరీ మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల నాణ్యత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.2500 కోట్లతో రోడ్ల నిర్వహణ చేపడుతున్నామని తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ఈ ఏడాది మే నాటికి వంద శాతం పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని తెలిపారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలుగు నిధులు పొందడం జరిగిందన్నారు. రహదారులు, భవనాల శాఖ అనంతపురం నందు మూడు విభాగాలు కలవని, అందులో అనంతపురం, ధర్మవరం, కళ్యాణదుర్గం, ఈ మూడు విభాగాలలో4289.255 కిలోమీటర్ రహదారుల కలవు, వీటిలో రాష్ట్ర ప్రధాన రహదారులు 3174.915 కిలోమీటర్లు ప్రధాన జిల్లా రహదారులు కలవన్నారు. ఇందులో 62.177 కిలోమీటర్ల నాలుగు వరసల రహదారులు 1400.994 కిలోమీటర్లు రెండు వరుసల రహదారులు 2826.084 కిలోమీటర్స్ ఒక వరుస రహదారుల కలవన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎం డి ఆర్ రుణం నందు 102.92 కోట్లతో 76 పనులు 527.419 కిలోమీటర్ల మేర మంజూరైన ఇందులో 21 పనులు పూర్తయ్యాయి, 6 పనులు జరుగుతున్నాయన్నారు. 40 పనులకు ఒప్పందం కావలసి ఉన్నది, 9 పనులకు టెండర్లు పూర్తి కావాల్సి ఉంద‌న్నారు. ఈనెల 21వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన 26 జిల్లాల కలెక్టర్లతో రోడ్డు విస్తరణ అమల్లో భూసేకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ పనులు వేగవంతంగా చేపట్టి రహదారుల నిర్మాణానికి సహకరించాలని కలెక్టర్ బసంత్ కుమార్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఎండి శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి జిల్లాల ఆర్అండ్ బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంట్రాక్టర్లు అధికారులతో సమావేశం నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement