Saturday, November 23, 2024

రహదారుల నిర్మాణానికి, బొగ్గు ఉత్పత్తి పెంపుకు చర్యలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో వివిధ రహదారుల నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి గురువారం పార్లమెంట్ లైబ్రరీ కమిటీ సమావేశంలో సహచర ఎంపీలతో కలిసి పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలు వేశారు. దేశంలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు కొరత తీవ్రంగా ఉందని, విద్యుత్ సంక్షోభం లేకుండా బొగ్గు డిమాండ్‌ను తీర్చేందుకు తీసుకుంటున్న చర్యలేంటని అడిగారు. ఎంపీ ప్రశ్నలకు కేంద్ర శక్తి, పునరుత్పాదక ఇంధన శాఖామంత్రి ఆర్.కె. సింగ్ గురువారం సమాధానమిచ్చారు. కోల్ ఇండియా లిమిటెడ్, సింగరేణి ద్వారా దేశీయ బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని, గత ఏడాదికాలంలో దాదాపు 7.5% ఉత్పత్తి పెరిగిందన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్లు బొగ్గు అవసరాలను తీర్చగలవని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడకు తూర్పు వైపున బైపాస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వానికి అభ్యర్థనలు అందాయా? విశాఖపట్నం పోర్టు నుంచి భోగాపురం వరకు జాతీయ రహదారి, రిషికొండ-భీమిలి ఆరు లేన్ల రోడ్డు నిర్మాణం కోసం అందిన ప్రాజెక్ట్ రిపోర్డ్ వివరాలేంటని ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు రోడ్డు, రవాణా, జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ బదులిచ్చారు. గతంలో 180 కి.మీ మేర రహదారి నిర్మాణంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించామన్నారు. వివిధ రోడ్ల నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం భూమిని ఉచితంగా అందించేందుకు అంగీకరించిందని వెల్లడించారు. విజయవాడ నుంచి 78 కిలోమీటర్ల తూర్పు బైపాస్‌ను మాత్రమే అభివృద్ధి చేయాలని నిర్ణయించామని మంత్రి చెప్పుకొచ్చారు. రోడ్ల ప్రాజెక్ట్‌లను ఆచరణలో పెట్టడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement