Sunday, November 24, 2024

లిడ్‌క్యాప్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు: మంత్రి మేరుగు నాగార్జున

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఉన్న లిడ్‌క్యాప్‌ ఆస్తులు నిరుపయోగంగా మిగిలిపోకుండా, అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబర్‌లో లిడ్‌ క్యాప్‌ అధికారులతో నాగార్జున సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ, వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ చర్మపరిశ్రమాభివృద్ధి సంస్థ (లిడ్‌ క్యాప్‌) సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లిడ్‌ క్యాప్‌ కు సంబంధించిన భూములు, ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు-గా వాటన్నింటినీ ఉపయోగంలోకి తేవడానికి ఉన్న అవకాశాలను కూడా ప్రతిపాదనల్లో పొందుపర్చాలని కోరారు.

రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో లిడ్‌ క్యాప్‌ కు ఉన్న భూములు, భవనాలలో ఇదివరకు నిర్వహించిన కార్యక్రమాలపై తనకు పూర్తి నివేదిక కావాలని కోరారు. ఇది వరకు ఎక్కడ ఏ కార్యక్రమాలను నిర్వహించారో, ఆ తర్వాత ఏ కారణంగా వాటిని నిలిపివేసారో తనకు తెలపాలని, ఇప్పుడు ఉన్న భూములు భవనాల్లో ఏ కార్యక్రమాలను చేపట్టడానికి అవకాశం ఉంది, అందుకు అవసరమైన నిధులను గురించి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. ఈ విషయంలో ఏ అంశాన్ని కూడా విస్మరించకూడదని స్పష్టం చేశారు విజయవాడ నగరం నడిబొడ్డున లిడ్‌క్యాప్‌కు ఉన్న విలువైన భూమిలో ఏ కార్యక్రమాన్ని చేపట్టాలనే విషయంగా కూడా ఒక నిర్ణయానికి రావాలని కోరారు.

లిడ్‌క్యాప్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చర్మకారులకు, డప్పు కళాకారులకు అవసరమైన సాయం అందించేలా చూడాలని సూచించారు. రాష్ట్రంలో చర్మకారులను ప్రోత్సహించడంలో భాగంగా ఆర్టీసీ బస్టాండుల్లో చర్మకార ఉత్పత్తులను విక్రయించుకొనే దుకాణాలకు పూర్తి ఉచితంగా లేదా నామ మాత్రపు అద్దెతో దుకాణాలను కేటాయించేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా నాగార్జున హామీ ఇచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement