కర్నూలు, ప్రభన్యూస్ : మాతాశిశు సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నాయి. ప్రసవ వేదన కష్టాలు దరిచేరకుండా పేదలకు భరోసా ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెబుతున్నాయి. ప్రతినెలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచడంతో పాటు మాతాశిశు మరణాలను తగ్గించేందుకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెబుతున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి మాతృవందన యోజన (పీఎంఎంవీవై) పథకం జిల్లాలో పడకేసింది. ఈ పథకంలో గర్బిణీలు, బాలింతలు, బిడ్డలకు పౌష్టికాహారం, టీకాలు, మందులకు అవసరమైన నగదు వారి బ్యాంకు ఖాతాలో జమచేసేవారు.
గత డిసెంబర్ నుంచి ఈ పథకం కింద సాయం మంజూరు కావడం లేదు. దీంతో దరఖాస్తు చేసుకున్న గర్భిణులు, బాలింతలు కష్టకాలంలో అసరా కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 వేలమందికి పైగా లబ్దిదారులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రోజురోజుకు ధరఖాస్తులు పెరుగుతున్న 11 నెలలుగా నిధులు మంజూరు కాకపోవడంతో లబ్ధిదారులకు ఎవరిని అడగాలో కూడ తెలియడం లేదు. వాస్తవంగా పిఎంఎంవివై ఈ స్కీమ్ క్రింద కేంద్ర ప్రభుత్వం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చాల్సి ఉంది. అయితే గత ఏడాది డిసెంబర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి నిధులు ఆపేసింది. రాష్ట్రం తన వాట నిదులను విడుదల చేయకపోవడంతో కేంద్రం కూడ నిధులను జమ చేయడం లేదు. పెండింగ్ బకాయిలు కోట్లలో ఉండగా, కొద్దికాలం క్రితం రూ.40 లక్షలు మాత్రమే జమయ్యాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి నిధుల కొరత కారణంగా ఈ పథకం అగిపోయింది. దీంతో సాయం అందుతుందా, లేదా అని లబ్దిదారులు ఆందోళన చెందుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital