Friday, November 22, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు భారీగా బోగస్ ఓట్ల నమోదు.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఉపాధ్యాయుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారీగా బోగస్ ఓట్ల నమోదు జరుగుతోందని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. అన్నమయ్య జిల్లాకు చెందిన నేత బి. మదన్ మోహన్ రెడ్డి బోగస్ ఓట్ల నమోదుపై సాక్ష్యాలతో సహా ఫిర్యాదు చేశారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ స్టాంపులను ఉపయోగించి ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్ల నమోదు చేశారని ఆయన ఆరోపించారు. కడప జిల్లాలోని ఓ పాఠశాలలో మొత్తం 13 మంది ఉపాధ్యాయులు ఉంటే, అక్కడ 79 ఓట్లు నమోదయ్యాయని తెలిపారు. మొత్తంగా నియోజకవర్గం పరిధిలో 2017లో ఎలక్టోరల్ లిస్టులో 22వేల ఓట్లు ఉంటే, ఇప్పుడు కొత్తగా ఏకంగా 30 వేల నకిలీ ఓట్లు నమోదయ్యాయని గణాంకాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. బోగస్ ఓటర్ల నమోదుపై జ్యుడీషియల్ విచారణ జరిపించి కఠిన చర్యలు చేపట్టాలని ఈసీని ఆయన కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్నవారిని తీసుకొచ్చి వారికి తలా రూ. 2వేలు ఇచ్చి బోగస్ ఓటర్లుగా నమోదు చేస్తున్నారని, ఓటు వేసిన తర్వాత మనిషికి రూ. 10 వేలు ఇస్తామని ఆశజూపారని మదన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement