Monday, November 25, 2024

కొండంతా పిండి పిండి.. చెరుకుపల్లిలో భూ భాగోతం మామూలుగా లేదుగా!

విజయనగరం, ప్రభన్యూస్ : జిల్లాకు చెందిన ఓ ఖద్దరు-ఒక అయ్యా ఎస్‌.. సంయుక్తంగా కొండను పిండి చేసే బాధ్యతను తలకెత్తుకొని విజయం సాధించే దిశలో చాలా దూరం దూసుకుపోయారన్నది భోగాపురంలో పబ్లిక్‌ టాక్‌. ఈ సాహస ఘట్టంలో కీలక పనిముట్టుగా మారిన సర్వే శాఖ తనదైన పనితనం చూపి ఒరిజినల్‌ రికార్డుల్లో లేని సబ్‌ డివిజన్లను సృష్టించి మరో 20ఎకరాలకు సంబంధించి చక్కని స్కెచ్‌ రూపొందించినట్లు చెప్పుకుంటున్నారు. భోగాపురం మండలం చెరుకుపల్లి రెవెన్యూ పరిధిలో కథకథలుగా చెప్పుకొంటున్న ఈ భారీ భూభాగోతానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే… చెరుకుపల్లి రెవెన్యూ పరిధి సర్వే నెంబర్‌ 1/1లో 53.95 ఎకరాల విస్తీర్ణంలో కొండ ఉంది… కాదు ఉండేది (ఇపుడు దొలిచేశారు). కొండ కొండ రూపంలో ఉన్నప్పుడే సర్వేశాఖ యుద్ధ ప్రాతిపదికన సర్వే చేపట్టి లేని 4 సబ్‌ డివిజన్లను (1/2,1/3,1/4,1/5) సృష్టించి నలుగురు పేరిట ఒక్కక్కరికి 5 ఎకరాలు చొప్పున పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది.

సూత్రధారుల్లో ఒకటిగా చెప్పబడుతున్న రెవెన్యూ శాఖ తదుపరి తంతును విజయవంతంగా నడిపించేసింది. అంతే.. ఆ నలుగురు తమ భూమి మొత్తం 20 ఎకరాలను యుద్ధ ప్రాతిపదికన అమ్మేశారు. ఈ విషయంలో భోగాపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం కూడా చిత్తశుద్ధితో పనిచేసి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను రెవెన్యూ శాఖ మాదిరిగానే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసింది.
ఉన్నపలంగా కొండను యథాస్థితిలో సర్వే చేసి మరీ ఓ నలుగురు పేరుతో చెరో 5 ఎకరాలు చొప్పున మొత్తం 20 ఎకరాలు చకాచకా ఆన్‌లైన్లోకి ఎక్కేలా తనవంతు పాత్ర పోషించింది సర్వే శాఖ పనితనాన్ని పబ్లిక్‌ మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. అదే సమయంలో ఎక్కడి నుంచో అకస్మాత్తుగా ఊడిపడి ఆన్‌లైన్లో తమ పేర్లతో డి-పట్టాలు అప్‌లోడ్‌ చేయించుకొని యుద్ధ ప్రాతిపదికన ఆ భూమిని అమ్మేసిన వారి ఘనత గూర్చి కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు.

మిగతా 33.95 ఎకరాలు ఎవరి చేతిలో వుందో తెలియదు గానీ చెరుకుపల్లికి చెందిన స్థానికులు అటువైపు కన్నెత్తి చూడడానికి కూడా వీలు లేదన్న చందంగా కాపు కాస్తున్నారు. అక్కడ ఒక భారీ హోటల్‌ నిర్మాణానికి ఖద్దరు ఎవరితోనో ఒప్పందం కుదుర్చుకున్నారని స్థానికుల మాటల్లో తెలుస్తోంది. అదలా వుంచితే.. కొండలు పిండి అవుతున్న క్రమంలో అప్పట్లో తమకు అందిన ఫిర్యాదు మేరకు జేసీబీని సీజ్‌ చేసిన మైనింగ్‌ శాఖ తదనంతర క్రమంలో వేదాంతం చెప్పనారంభించారు. కొండను దొలిచిన వారు మొక్కలు వేస్తున్నారు కదా! మీకేంటి సమస్య అంటూ పిండవుతున్న కొండ గురించి ఫిర్యాదు చేసిన వారికి హితబోధ చేయడంతో అవాక్కవ్వడమే ఫిర్యదీదారుల వంతయింది.

అయితే స్థానికుల మాటల్లో వెల్లడవుతున్న ఈ కొండ గాధ హృదయవిదారకమే అని చెప్పేందుకు బలమైన సాక్ష్యాలు వున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు నిగ్గు తేల్చాల్సింది జిల్లా సర్వోన్నతాధికారే. ఒక వేళ నలుగురికి డీ-పట్టాలివ్వడం సమర్ధనీయమని పరిస్థితులు చాటిచెప్పే సందర్భం వుందనుకున్నా పిండి అయిపోయిన కొండ విషయంలో బాధ్యులపై చర్యలు ఆశిస్తున్నారు స్థానికులు. అదే విధంగా కొండ దిగువన అనధికారంగానే అయినా అనాదిగా వస్తున్న స్మశానాన్ని కప్పేస్తున్న వైనంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్నింటికీ మించి ఈ పిండైన కొండ తంతు గురించి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలడిగినా రెవెన్యూ వాళ్లు ససేమిరా అనేయడం పలు సందేహాలకు తావిచ్చినట్లయింది. మొత్తం మీద ఆ ఖద్దరు ఎవరు? అయ్యా…ఎస్‌ అంటూ ఆయనతో ‘సంయుక్త’ంగా ముందుకెళ్లింది ఎవరు? అన్నది తేలాలంటే చెరుకుపల్లి కొండ గాధపై జిల్లా సర్వోన్నతాధికారి దృష్టి సారించాల్సిందే! అంతవరకు అంతా వేచి చూడాల్సిందే!

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement