అల్లూరి జిల్లా ఏజెన్సీలో గంజాయి నియంత్రణపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అల్లూరి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా ఆదేశాలతో.. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా అల్లూరు ఏజెన్సీలో గంజాయి తోటలపైనే ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమాన్ని విస్తృతం చేశారు. గిరిజనుల్లో గంజాయి అనర్ధాలపై అవగాహన కల్పిస్తూనే.. ఇంకా మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి తోటలు ఉంటే స్థానికుల సహకారంతో వాటిని ధ్వంసం చేస్తున్నారు. రెండు రోజుల్లో పాడేరు ఏజెన్సీలో 64 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు.
ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు, అల్లూరి జిలా పాడేరు ఏజెన్సీలో ఇంకా మారుమూల ప్రాంతంలో గంజాయి సాగు అవుతున్నట్టు పోలీసులకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ఏజెన్సీలో చాలావరకు సాగును కంట్రోల్ చేసిన పోలీసులు.. పూర్తిగా నియంత్రణలోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా.. ఇన్ఫర్మేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకుని గంజాయి తోటలపై ఆరా తీస్తున్నారు. తాజాగా రెండు రోజుల్లో 64 ఎకరాల్లో గంజాయి తోటలను ధ్వంసం చేశారు పోలీసులు. జీ. మాడుగుల మండలంలో 9 ఎకరాలు, పెదబయలులో 22 ఎకరాలు, ముంచింగి పుట్టులో 33 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతున్నట్టు గుర్తించారు. గిరిజనుల్లో ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని అవగాహన కల్పిస్తున్నారు. గంజాయి తోటలో ధ్వంసం చేసిన పోలీసులు కొంతమంది పై కేసులు పెట్టారు. అలాగే ఏవోబిలో గంజాయి సాగుపై స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నారు పోలీసులు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా 25సెంట్లలో గంజాయి తోటల ధ్వంసం చేశారు.