కర్నూలు బ్యూరో : అనుమానం పెనుభూతమై ఓ వివాహిత ప్రాణాలను బలిగొంది. భర్త వేధింపులు భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలు జిల్లా ఆదోనీలో చోటు చేసుకుంది. ఇవాళ వెలుగు చూసిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోనిలోని అమరావతి నగర్‌కు చెందిన శ్రీనివాసులు ఆదోని వాటర్ వర్క్స్‌లో లైన్మెన్గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడేళ్ల క్రితం ఆదోని వాల్మీకి నగర్‌కు చెందిన పావనితో వివాహం జరిగింది. కాగా శ్రీనివాసులుకు ఇది రెండో సంబంధం. ప్రస్తుతం వారికి ఎనిమిది నెలల కుమార్తె కావ్య ఉంది. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితంలోకి అనుమానం పెనుభూతమై వచ్చింది. భార్య పావనిపై భర్త శ్రీనివాసులు అనుమానం పెంచుకున్నాడు.
దీంతో అప్పటి నుంచి భర్త పావనిని వేధింపులకు గురి చేసేవాడు. వీటికి తోడు తోటి ఆడపడుచుల సూటీ పోటీ మాటలు ఆమెను మరింత కుంగతీసాయి. దీంతో పావని తీవ్ర మనోవేదనకు గురయింది. ఒక్కొక్క సారి భార్యను శ్రీనివాసులు కొట్టేవాడు కూడా. తీవ్ర మనస్తాపానికి గురైన పావని ఇక ఈ వేధింపులు భరించలేక ఆదివారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొంత సేటికి దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో హుటాహుటిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భర్త శ్రీనివాసులుతో పాటు అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.