Tuesday, November 26, 2024

మార్గ‌ద‌ర్శి కేసుల‌లో కొన‌సాగుతున్న అరెస్ట్ ల ప‌ర్వం…..

అమరావతి, ఆంధ్రప్రభ:మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కేసులో సీఐడి దూకుడు పెంచింది. సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందని కేసులు నమోదు చేసిన సీఐడీ మార్గదర్శికి చెందిన నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో శనివారం సోదాలు నిర్వహించిన సీఐడీ.. పలువురు ఫోర్‌మెన్‌లను అదుపులోకి తీసుకుంది. ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. తనిఖీలు, రికార్డుల పరిశీలన పూర్తయిన మీదట పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు విశాఖపట్నం మార్గదర్శి బ్రాంచి ఫోర్‌మెన్‌ కామినేని రామకృష్ణ, రాజమండ్రి మార్గదర్శి బ్రాంచి ఫోర్‌మెన్‌ సత్తి రవి శంకర్‌, విజయవాడ మార్గదర్శి ఫోర్‌మెన్‌ బి.శ్రీనివాసరావు, గుంటూరు మార్గదర్శి ఫోర్‌మెన్‌ గొరిజవోలు శివరామకృష్ణలను అరెస్ట్‌ చేశారు. వారిని కోర్టులో హాజరుపరచ నున్నట్లు తెలిపారు. ఇండివిడ్యువల్‌ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్‌ సమర్పించలేదని, బ్యాలెన్స్‌ షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి అందజే యలేదని అధికారులు తెలిపారు. మూడు నెలలుగా మార్గదర్శికి చెందిన 444 గ్రూపులకు సంబంధిం చి కార్యకలాపాలను నిలిపివేశా రని, నిబంధనలు బేఖాతార్‌ చేసినట్లు పేర్కొన్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో రామోజీరావు, శైలాజా కిరణ్‌..
మార్గదర్శి వ్యవహారంలో రాష్ట్రంలోని వివిధ చోట్ల పలు కేసులు నమోదయ్యా యి. ఐపీసీ సెక్షన్‌ 120(బి), 409, 420, 477(ఏ), రెడ్‌ విత్‌ 34, అలాగే ఆంధ్రప్రదేశ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1999 సెక్షన్‌ 5 ప్రకారం, అలాగే చిట్‌ ఫండ్‌ యాక్ట్‌ 1982 లోని సెక్షన్‌ 76, 79 ప్రకారం నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌లో మొదటి, రెండో నిందితులుగా చెరుకూరి రామోజీరావు, శైలజా కిరణ్‌లను పేర్కొన్నారు. ఇక ఇన్వెస్టిగేటింగ్‌ అధారిటీ-గా స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నట్లు సీఐడి తెలిపింది. వివిధ బ్రాంచిల ఫోర్‌మెన్‌లను ముందు గా అరెస్టు చేసిన సీఐడీ, తదుపరి చర్యలకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
విశాఖ మార్గదర్శి మేనేజర్‌కు జ్యుడిషియల్‌ రిమాండ్‌
విశాఖ, ప్రభన్యూస్‌: మార్గదర్శి చిట్‌ఫండ్స్‌పై దాడుల నేపథ్యంలో తాజాగా విశాఖ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ను ఆదివారం తెల్లవారుజామున సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చెెశారు. కేసులో ఏ3 ముద్దాయిగా ఉన్న మేనేజర్‌ కామినని రామకృష్ణను న్యాయస్థానంలో హాజరుపరచగా, జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సిఐడి అడిషనల్‌ ఎస్పీ రవి వర్మ అద్వర్యం దాడులు జరిగాయి.పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ శేషు వాదనలతో కోర్టు రిమాండ్‌ విధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement