Saturday, January 11, 2025

Kadapa | వైఎస్ అభిషేక్ కు పలువురు నివాళులు..

పులివెందుల అర్బన్, జనవరి 11 (ఆంధ్రప్రభ) : అనారోగ్యంతో మృతిచెందిన వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థివదేహానికి పులివెందులలోని ఆయన నివాసంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైయస్ అభిషేక్ రెడ్డి చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతిచెందడం చాలా బాధాకరమన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ అభిషేక్ రెడ్డి, జగనన్న గెలుపు కోసం నా గెలుపు కోసం అహర్నిశలు కష్టపడిపని చేశారన్నారు. వైయస్ అభిషేక్ రెడ్డివిద్యాభ్యాసం పులివెందుల పట్టణంలోని రిషి విద్యానికేతన్, బిషప్ కాటన్స్ బాయ్స్ స్కూల్, బెంగుళూరు లో చదవడం జరిగిందన్నారు. ఎంబీబీఎస్ 2011-మమత మెడికల్ కాలేజీ, ఖమ్మంలో పూర్తిచేయడం జరిగిందన్నారు. ఆర్థోపెడిక్స్ పీజీ, వైదేహీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, బెంగుళూరులో కంప్లీట్ చేయడం జరిగిందన్నారు.

కర్ణాటక రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారన్నారు. పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి మెడికల్ సెంటర్ లో వైద్యుడిగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ మంచి గుర్తింపు పొందారన్నారు. విశాఖపట్నంలో ఆయన ప్రాక్టీస్ చేస్తూ మంచి ఆర్థోపెడిషియన్ గా పేరు తెచ్చుకున్నారన్నారు. రాజకీయాల్లోకి అడుగు పెట్టినప్పుడు వైయస్ అభిషేక్ రెడ్డి వైఎస్సార్సీపీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం లింగాల మండలానికి ఇంఛార్జిగా బాధ్యతలు చేపట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, త‌న గెలుపున‌కు కృషి చేశారన్నారు. పులివెందుల నియోజకవర్గంలో యువ నాయకుడిగా మంచి గుర్తింపు పొందారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ కుటుంబ సభ్యులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

వైయస్ అభిషేక్ రెడ్డి పార్థీవ దేహానికి బీటెక్ ర‌వి నివాళులు…
పులివెందుల, జనవరి 11 (ఆంధ్రప్రభ ) : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు డా. వైఎస్ అభిషేక్ రెడ్డి పార్థీవదేహానికి పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి, సింహాద్రిపురం మండలం టీడీపీ ఇంచార్జ్ మారెడ్డి జోగిరెడ్డి, పులివెందుల మండల ఇన్చార్జ్ బ్రాహ్మణ పల్లె వెంకట్రామిరెడ్డి, మాజీ పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా, నల్లగారి భాస్కర్ రెడ్డి, సారెడ్డి గంగాధర్ రెడ్డిలు పలువురు టీడీపీ నాయకులు నివాళుల‌ర్పించారు. అస్వస్థతకు గురైన అభిషేక్ రెడ్డి చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.

అభిషేక్ రెడ్డి కుటుంబంతో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో శనివారం టీడీపీ ఇన్ చార్జి బీటెక్ రవి వారి నివాసానికి చేరుకుని పార్థీవ దేహానికి నివాళుల‌ర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం బీటెక్ రవి మాట్లాడుతూ… అభిషేక్ రెడ్డి మృతి చాలా బాధాకరమన్నారు. వైఎస్ ప్రకాష్ రెడ్డి కుమారుడు పాల్ రెడ్డి కూడా 35 సంవత్సరాల్లోనే అర్దాంతరంగా చనిపోవడం జరిగిందని, పాల్ రెడ్డి చనిపోవడం ఆ కుటుంబానికి తీరని లోటుగా మిగిలిందని, త‌న రాజకీయ ఎదుగుదలకు పాల్ రెడ్డి ఎంతో సహకరించారన్నారు. త‌మ కుటుంబానికి వైయస్ ప్రకాష్ రెడ్డి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని, చిన్న వయసులో అభిషేక్ రెడ్డి మృతిచెంద‌డం చాలా బాధాకరమ‌న్నారు. అభిషేక్ రెడ్డి ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖాసిం వలి, సమ్మద్ తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement