న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మానసిక ఆరోగ్యం, భావోద్వేగాల నియంత్రణకు సహకరించేందుకు మనోదర్పణ్ పేరుతో విద్యా శాఖ ఓ పథకాన్ని చేపట్టిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కోవిడ్19 సమయంలో, ఆ తర్వాత వర్తించేలా పథకాన్ని రూపొందించామని వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణదేవి సోమవారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో ఇందుకోసం టోల్‌ఫ్రీ నంబర్ 8448440632ను ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు.
మానసిక ఆరోగ్యానికి అవసరమైన డిప్లొమా కోర్సును టీచర్ కౌన్సిలర్ పద్ధతిలో NCERT అందజేస్తోందని తెలిపారు. పరీక్షలకు ముందు, పరీక్షల తర్వాత ఒత్తిడిని అధిగమించేలా సీబీఎస్‌ఈ టెలీ కౌన్సిలర్ల సదుపాయాన్ని కల్పించిందని కేంద్రమంత్రి వెల్లడించారు. కేంద్రీయ విద్యాలయాల్లో కౌన్సిలర్లను నియమించి ఆ మేరకు విద్యార్థులకు సహాయం అందజేస్తున్నాయని సమాధానంలో పేర్కొన్నారు. అలాగే ఉపాధ్యాయులకు వర్క్‌షాపులు, శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. విద్యా వ్యవస్థ రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలో ఉందన్న కేంద్రమంత్రి, అత్యధిక శాతం స్కూళ్లు రాష్ట్రాల పరిధిలో ఉన్నందున మానసిక ఆరోగ్యంపై రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించారు.