Tuesday, November 26, 2024

Mann Ki Baat – అరకు వ్యాలీ కాఫీ, జిసిసి కృషిని ప్రశంసించిన ప్రధాని మోది

విశాఖపట్నం.. ఆంధ్ర ప్రభ బ్యూరో అరకు వ్యాలీ కాఫీ స్థాయిని ప్రపంచస్థాయిలో విస్తృతం చేయడంలో గిరిజన సహాకార సంస్థ (జిసిసి) కీలక పాత్ర పోషిస్తున్నదని ప్రధాని నరేంద్ర మోది ప్రసంశించారు. ఆదివారం నాడు మన్ కి భాత్ కార్యక్రమంలో దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అల్లూరి జిల్లా మన్య ప్రాంతంలో గిరిజన సహకార సంస్థ, ఎపి ప్రభుత్వ సహకారంతో గిరిజనులు సాగు చేస్తున్న అరకువ్యాలీ కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. మన దేశంలో స్థానిక ఉత్పత్తులు ప్రపంచ స్థాయి గుర్తింపును సాదిస్తుండడం భారతీయులంతా గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. అలాంటి ఉత్పత్తుల్లో అరకువ్యాలీ కాఫీ ప్రధమ శ్రేణిలో వుంటుంది అన్నారు.

- Advertisement -

అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు కాఫీని గిరిజనులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారని, శ్రేష్టమైన అరోమా రుచి గల ఇక్కడ పండే అరకు కాఫీ మంచి గుర్తింపు వుందని ప్రధాని అన్నారు. 1 లక్షా 50 వేల మంది ఆదివాసీ కుటుంబాలు అరకు కాఫీ సాగు, ఉత్పత్తి, విక్రయాలతో ఆర్ధిక సాధికారత సాధిస్తున్నారని అన్నారు. కాఫీకి గ్లోబల్ గుర్తింపు తీసుకురావడంలో విశేషమైన కృషి చేస్తున్న గిరిజన సహకార సంస్థ (జిసిసి) ఆదివాసీ రైతు సోదర,సోదరీమనులను ఒక త్రాటిపైకి తీసుకువచ్చి, కాఫీ సాగుకు ప్రోత్సహిస్తున్నదని ప్రశంసించారు. ఈ ప్రక్రియలో గిరిజనుల ఆదాయం గణనీయంగా పెరగడంతో పాటు గౌరవనీయమైన జీవనాన్ని సాగిస్తున్నారని అన్నారు


చంద్రబాబుతో అరకు కాఫీని ఆస్వాదించాను : ప్రధాని మోడి
గతంలో విశాఖపట్నం సందర్శించినపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి అరకు కాఫీని ఆస్వాదించే అవకాశం లభించిందని ప్రధాని మోడీ మన్ కి బాత్ లో గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చంద్రబాబుతో కలిసి కాఫీ తాగుతున్న ఫోటోలను ప్రదర్శించారు. అరకు కాఫీ రుచి గురించి చెప్పాల్సిన అవసరంలేదు..అద్భుతంగా వుందని అన్నారు. అరకు కాఫీకి ప్రపంచస్థాయి అవార్డులు ఎన్నో వచ్చాయని అన్నారు. డిల్లీలో జరిగిన జి 20 సమ్మిట్ లో కూడా అరకువ్యాలీ కాఫీకి ప్రాచుర్యం లభించిందని అన్నారు. మీకు ఎప్పుడు వీలు దొరికినా అరకువ్యాలీ కాఫీ రుచిని ఆస్వాదించండి అని ప్రధాని మోది చెప్పారు.


గిరిజనుల ఆర్ధిక సాధికారతకు ఊతమిస్తున్న అరకు కాఫీ : జిసిసి వైస్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ : జి. సురేష్ కుమార్


అల్లూరి జిల్లాలో అరకు వ్యాలీ సాగు, గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం, జిసిసి అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రధానినరేంద్ర మోడి మన్ కి బాత్ లో ప్రత్యేకంగా ప్రస్తావించడం గర్వకారణంగా వుందని జిసిసి వైస్ చైర్మెన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి. సురేష్ కుమార్ అన్నారు. ప్రధాని స్ఫూర్తివంతమైన వ్యాఖ్యలు, ప్రశంస గిరిజన కాఫీ రైతులకు, జిసిసి సిబ్బందికి, కాఫీ సాగుతో ముడిపడి వున్న అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, వర్గాల వారికీ ఎంతగానో ఉత్తేజాన్ని, ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుందని అన్నారు. గిరిజనుల ఆర్ధిక సాధికారతకు అరకు కాఫీ ఎంతగానో ఊతమిస్తున్నదని చెప్పారు

Advertisement

తాజా వార్తలు

Advertisement