అమరావతి: బక్రీద్ సందర్భంగా మంగళగిరి ఈద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముగ్గురు టిడిపి కార్యకర్తలను వైకాపా నేతలు హత్య చేసినా సంయమనం పాటిస్తున్నామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెప్పారు. తమ కార్యకర్తలకు ఆగ్రహం వ్యక్తం చేస్తే వాళ్లు ఎక్కడ ఉంటారో తెలుసుకోవాలన్నారు. రుషికొండ ప్యాలెస్ వ్యవహారంలో ఇంకా బయటికి రావాల్సిన చిత్రాలు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
ప్రజాదర్బార్‌కు అనూహ్య స్పందన
మంగళగిరి ప్రజల కోసం మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’కు అనూహ్య స్పందన లభిస్తోంది. గత రెండు రోజులుగా ఆయన ప్రజా దర్బార్ పేరిట ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న విషయం తెలిసిందే. సోమవారం కూడా నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఉండవల్లిలోని ఆయన నివాసానికి తరలివచ్చి తమ సమస్యలను లోకేశ్ దృష్టికి తీసుకువచ్చారు. జీతాలు పెంచాలని అంగన్వాడీ టీచర్లు, బదిలీల కోసం ఉపాధ్యాయులు, ఉపాధి కల్పించాలని నిరుద్యోగులు ఆయనకు విన్నవించారు. విద్య, వైద్య ఖర్చులకు సాయం అందించాలని పలువురు కోరారు. వైకాపా నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములను బలవంతంగా లాక్కున్నారని, తమకు న్యాయం చేయాలని పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. అందరి సమస్యలను ఓపికగా విన్న లోకేశ్… సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపుతామంటూ వారికి భరోసా ఇచ్చారు.