Monday, November 11, 2024

Mangalagiri AIMS – పీపుల్స్​ హాస్పిటల్​! ఇక్కడ 10 రూపాయలకే వైద్యం

మంగళగిరి ఎయిమ్స్‌కు పెరిగిన క్యూ
చిప్స్​ పాకెట్ ఖర్చుతోనే డాక్టర్​ని కలువొచ్చు​
రూ. 60 వేల‌కే కిడ్నీ ఆప‌రేష‌న్ పూర్తి
ఇత‌ర హాస్పిట‌ళ్ల‌లో అయితే రూ. 2.5 లక్షలు
అడ్మిషన్​ చార్జీలు రూ. 25 మాత్రమే
మెడిసిన్స్​ కోసం అమృత్​ ఫార్మసీ
13 విభాగాల్లో అందుతున్న వైద్యం
పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ఇంకొన్ని సేవలు
పెద్ద ఎత్తున తరలివస్తున్న పేషెంట్స్​
అవుట్​ పేషెంట్​ విభాగంలో డాక్టర్ల కొరత
క్యూలో ఉండలేక రోగుల ఇబ్బందులు
అన్నింటికి పరిష్కారం చూపుతామన్న ఎయిమ్స్​ డైరెక్టర్​

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, స్పెష‌ల్ డెస్క్‌: ఒక చిప్స్ ప్యాకెట్ ఖరీదుతో ఆసుపత్రికి వెళ్లి డాక్టర్‌కు చూపించుకోవచ్చని తెలుసా?.. మీరు చదివింది, నిజమే! మంగళగిరిలోని ఎయిమ్స్‌లో డాక్టర్ ఫీజు కేవలం పది రూపాయలు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టానికి అనుగుణంగా మంగళగిరి వద్ద ఎయిమ్స్ ఏర్పాటైంది. 2018లో విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ కేంద్రంగా తాత్కాలికంగా ఎయిమ్స్ సేవలు ప్రారంభమయ్యాయి. 2019 మార్చి 12 నుంచి మంగళగిరిలోని శాశ్వత భవనంలో ఓపీడీ సేవలు మొదలయ్యాయి.

అడ్మిష‌న్ ఫీజు 25 రూపాయ‌లే..

- Advertisement -

కరోనాకు కొద్దిరోజుల ముందే ఎయిమ్స్ మంగళగిరిలో అవుట్ పేషెంట్ సేవలు మొదలయ్యాయి. పది రూపాయలకే డాక్టర్ అందుబాటులో ఉండడం, అనేక పరీక్షలకు కూడా ఖర్చు తక్కువే కావడంతో దూరప్రాంతాల నుంచి కూడా రోగులు రావడం మొదలయ్యింది. ఇక కరోనా సమయంలో ఎయిమ్స్ మంగళగిరి ప్రాంగణంలోనే సేవలందించారు. ఓపీతో పాటుగా ఇన్ పేషెంట్స్ సేవలు కూడా మొదలయ్యాయి. తొలుత 50 పడకల ఆస్పత్రిగా ప్రారంభించి, క్రమంగా విస్తరిస్తున్నారు. ప్రస్తుతం 960 బెడ్స్​ అందుబాటులో ఉన్నాయి. అనేక దీర్ఘకాలిక వ్యాధులకు ఇన్ పేషెంట్ సేవలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అందులోనూ అడ్మిషన్‌ చార్జీ కింద రూ.25 వసూలు చేస్తున్నారు. రోగి కోసం ఒక్కో పడకకు రోజుకు రూ. 30 చార్జిగా నిర్ణయించారు.

మందుల కోసం అమృత్​ ఫార్మసీ..

మంగళగిరి ఎయిమ్స్​లో నర్సింగ్‌ చార్జీలు, ఇతర ఫీజులేమీ ఉండవు. వైద్య పరీక్షలు, మందులకు అతి తక్కువ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. రోగులకు అవసరమైన మందుల కోసం అమృత్‌ ఫార్మసీ కూడా అందుబాటులో ఉంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్‌తో పాటుగా ఏపీ ప్రభుత్వ ఆరోగ్య శ్రీని కూడా ఇక్కడ అనుమతిస్తున్నారు.

స్వల్ప ఖర్చుతోనే…

ఇన్ పేషెంట్ సేవలతో పాటుగా అవుట్ పేషెంట్ సేవలకు కూడా తక్కువ మొత్తంలోనే ఫీజులు వసూలు చేస్తారు. కేన్సర్, మూత్రపిండాలు, ఉదర కోశ సంబంధిత సర్జరీలు స్వల్ప ఖర్చుతోనే చేస్తున్నారు. ఇంకా.. మంగళగిరి ఎయిమ్స్‌లో టెలీ మెడిసిన్ సేవలు కూడా ఉన్నాయి. ఏ డిపార్ట్ మెంట్ వైద్యులను కలిసేందుకైనా ఒకటే ఫీజు.

ఓపీ వేళలు:

ఉదయం: 8:00 గంటల నుంచి మధ్యాహ్నం: 01:00 గంట వరకు (సోమవారం-శుక్రవారం) ఓపీ తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేయించుకుని టోకెన్‌ తీసుకున్న రోగులు సాయంకాలం నాలుగు గంటల లోపు వైద్య సేవలను పొందవచ్చు. శనివారం: మధ్యాహ్నం 12గంటల వరకు మాత్రమే ఓపీ ఉంటుంది.
ఆదివారం ఓపీ విభాగాన్ని మూసివేస్తారు.

టెలీమెడిసిన్:

ఉదయం 8:30 నుంచి 11 గంటల మధ్య 85230 07940 లేదా 94930 65718 నంబర్లకు ఫోన్‌ చేసి పేరు నమోదు చేయించుకోవాలి. నమోదు చేయించుకున్న పేషెంట్లకు ఉదయం 11 గంటల నుంచి వైద్యులే ఫోన్‌ చేసి సలహాలు అందిస్తారు. ఇది పూర్తిగా ఉచితం.

మహిళల కోసం ప్రత్యేకం..

మహిళల కోసం ప్రత్యేకంగా స్క్రీనింగ్ విభాగం ఉంది. ప్రతి బుధవారం మధ్యాహ్నం 02:00 గంటల నుంచి 04:00 గంటల వరకు రొమ్ము క్యాన్సర్ పరీక్షలు చేస్తున్నారు. ఇందుకు ఫీజు రూ.10 మాత్రమే. మామోగ్రఫీ అవసరమైనవారికి తక్కువ ఫీజుతో అందిస్తున్నామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.

60వేల‌తో కిడ్నీ ఆప‌రేష‌న్ పూర్తి

2019 నుంచి తొలి ఐదేళ్ల‌లోనే 10 లక్షల మందికి సేవలు అందించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మంగళగిరి ఎయిమ్స్‌లో తమకు తక్కువ ఖర్చులోనే వైద్య సేవలు అందుతున్నాయని రోగులు చెబుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల కంటే తక్కువ ధరకే ఆపరేషన్ చేసినట్లు ప‌లువురు తెలిపారు. ‘‘ఆటో డ్రైవ‌ర్‌గా పని చేస్తున్నా. రెండేళ్ల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యా. ప్రైవేటు ఆస్పత్రిలో చేరితే వైద్యం ఖర్చులు, ఆపరేషన్ కోసం రూ. 2.50 లక్షలకు పైగా అవుతుందని చెప్పారు. అంత డబ్బు నా దగ్గర లేదు. ఆరోగ్య శ్రీ కోసం ట్రై చేశాం. అయితే, నాకున్న కిడ్నీ సమస్యకు ఆరోగ్య శ్రీ వర్తించదన్నారు. దీంతో ఎయిమ్స్ మంగళగిరి గురించి తెలిసింది. అక్కడికి వెళ్లగా మందులు, ఖర్చులు కాకుండా రూ. 60 వేలకు ఆపరేషన్ అయిపోయింది” అని వెంకటేశ్​ చెప్పారు.

త్వరలోనే మరిన్ని సేవలు

మెడికల్ కాలేజీ భవనాలు, హాస్పిటల్, హాస్టళ్లు, నర్సింగ్ కాలేజ్ కూడా అందుబాటులోకి వచ్చింది. వైద్య విద్యార్థులకు మంగళగిరి ఎయిమ్స్ అనువైన శిక్షణ కేంద్రంగా మారింది. దీంతో పాటు రోగులకు వివిధ రకాల సేవలు అందుతున్నాయి. ఈ సేవలను మరింత విస్తృతం చేసే యత్నాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 98 శాతం పనులు పూర్తి కావడంతో మరింత మెరుగైన సేవలు అందించే యత్నంలో ఉన్నామని ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్ డాక్టర్ మాధవనంద కర్ తెలిపారు.

మరో 17 ఆపరేషన్ థియేటర్లు సిద్ధం చేయాల్సి ఉండగా, స్వల్పకాలంలోనే 10 లక్షల మందికి సేవలందించిన మంగళగిరి ఎయిమ్స్ బృందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. గత నెలలో ఆయన ఈ సంస్థను జాతికి అంకితం చేశారు. మంగళగిరి ఎయిమ్స్‌లో ప్రొఫెసర్లు, అడిషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదాల్లో పనిచేస్తున్న వైద్యులు 180 మంది వరకూ ఉన్నారు. ఇతర సిబ్బంది మరో 400 మంది ఉంటారు.

వైద్యుల కొరత..

ఓపీ సేవలందించడానికి సరిపడా వైద్యాధికారులు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర కాలయాపన అవుతోందని రోగులు అంటున్నారు. “కాలినొప్పితో ఓపీ కోసం వచ్చాను. నూజివీడు నుంచి బయలుదేరి ఉదయం పది గంటలకు ఆస్పత్రికి వచ్చాను. ఓపీ రిజిస్ట్రేషన్‌కే గంటన్నర పట్టింది. పదకొండున్నరకి ఆర్ధోపెడిక్ ఓపీ దగ్గరకి వెళితే అక్కడ మళ్లీ క్యూ ఉంది. మధ్యాహ్నం 2 వరకూ వేచి చూసిన తర్వాత డాక్టర్ లంచ్‌కి వెళ్లారని చెప్పారు. ఆ తర్వాత 2.30కి ఆయన వచ్చిన తర్వాత నాకు చూపించుకోవడానికి 3.30 దాటింది. అర్ధోపెడిక్ వంటి విభాగాల్లో తీవ్ర రద్దీ ఉంటుంది. అందుకు తగ్గట్టుగా ఎక్కువ మంది డాక్టర్లు కావాలి” అని మహేశ్​ అనే పేషెంట్ అన్నారు.

ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్పప్పటికీ త్వరలోనే అన్నింటినీ పరిష్కరించి రోగులకు అత్యున్నత సేవలు అందించే ప్రయత్నంలో ఉన్నామని ఎయిమ్స్ మంగళగిరి కమ్యూనికేషన్ విభాగాధిపతి శంకరన్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement