Tuesday, November 19, 2024

మందుల్లేవ్.. చేతులెత్తేసి నాకో, విలవిల్లాడుతున్న ఎయిడ్స్‌ రోగులు..

అమరావతి, ఆంధ్రప్రభ: హెచ్‌ఐవీ రోగులకు మందులు సరఫరా చేయలేమంటూ నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (నాకో) చేతులెత్తేసింది. రోగులకు అందించే సెకండ్‌లైన్‌ మందులకు తీవ్రమైన కొరత రావడంతో కొనుగోలు చేయలేమని నాకో తెగేసి చెప్పింది. గత నెల 30వ తేదీన నాకో కేర్‌ అండ్‌ సపోర్ట్‌ ట్రీట్‌మెంట్‌ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ అనూప్‌కుమార్‌ పూరి నుంచి సాక్స్‌ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కు సర్క్యూలర్‌ అందింది. దీని ప్రకారం సె కండ్‌ లైన్‌ రోగులకు టెనొఫవిర్‌, లామివుడిన్‌, అటాజనవిర్‌, రిటనోవిర్‌కు బదులు మొదటి రకం మందులు టెనోఫ విర్‌ ప్లస్‌ లామివుడిన్‌ దొలుతెగ్రవిర్‌ ఇవ్వాలని సర్క్యూలర్‌ పేర్కొన్నారు. రెండో రకం మందులు వాడుతున్న రోగులకు మొదటి రకం మందులు ఇవ్వడం వలన ఎయిడ్స్‌ రోగి శరీరంలో భవిష్యత్‌లో దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు పేర్కొంటున్నారు. నాకో రెండో రకం మందుల్ని సరఫరా చేసే వరకు ఏపీ సాక్స్‌ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మందుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2.20 లక్షల మంది ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. వీరికి వైద్య సేవలు అందించడం కోసం 43 ఏఆర్‌టీ సెంటర్లు పనిచేస్తున్నాయి. నేషనల్‌ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ (నాకో) ద్వారా కేంద్ర ప్రభుత్వమే నిధుల్ని సమకూరుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.62 కోట్ల నిధుల్ని ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేశారు. ప్రతి ఏడాది సుమారు పదివేల మంది రోగుల సంఖ్య పెరుగుతోంది.

మందుల కొరత..

ఎయిడ్స్‌ బాధితులకు నేషనల్‌ ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ (నాకో) హెచ్‌ఐవీ నిర్ధారణ పరీక్షలతో పాటు హెచ్‌ఐవీ సోకిన వారికి యాంటీ రిట్రోవైరల్‌ ట్రీట్‌మెంట్‌ (ఏఆర్‌టీ) మందులు ఏపీ సాక్స్‌ ద్వారా రాష్ట్రంలో ఉన్న 45 ఏఆర్‌టీ సెంటర్స్‌లో ఉచితంగా ప్రతినెలా అందిస్తోంది. ఈ మందులు రోగి శరీరంలో వైరస్‌ని నియంత్రణ చేసి రోగి శరీరంలో వైరస్‌ని నియంత్రణ చేసి రోగి జీవిత కాలం పొడిగించటానికి ఉపయోగపడతాయి. ఈ మందుల్ని బయటి మార్కెట్‌లో కొనుగోలు చేయాలంటే రూ.3 వేల నుంచి రూ.7 వేలు ఖర్చవుతోంది. ఇలాంటి మందుల్ని ఎయిడ్స్‌ రోగులుకు ఫస్ట్‌ లైన్‌, సెకండ్‌లైన్‌, థర్డ్‌ లైన్‌ మూడు రకాలుగా అందిస్తారు. మొదటి రకం మందులు ప్రస్తుతం హెచ్‌ఐవీ సోకిన రోగికి చికిత్స స్టేజి 1, 2 ట్రీట్‌ ఆల్‌ అందిస్తున్నారు. అవసరం అయిన వారందరికీ ఉచితంగా అందిస్తున్నారు. సెరో పాజిటివ్‌ మహిళలు, వైరస్‌ సోకిన పిల్లల చికిత్సకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఏఆర్‌టీ రెండో రకం మందుల్ని మొదటి రకం మందులు రోగికి స క్రమంగా పనిచేయనప్పుడు వైరాలాజికల్‌, ఇమ్యూనాలాజికల్‌ ఫెయిల్యూర్‌ అయినప్పుడు క్షయలాంటి వ్యాధికి గురి అయినప్పుడు నిపుణుల బృందం సిఫార్స్‌ మెరకు అందిస్తారు. ఇప్పుడు నాకో నుంచి సరఫరా చేస్తున్న ఈ యాంటీ రిట్రోవైరల్‌ ట్రీట్‌మెంట్‌ మందులు గత కొన్ని నెలలుగా సక్రమంగా రోగులకు అందడం లేదు. వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేయలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. డాల్టగ్రవిర్‌ మెడిసన్‌కు కొరత రావడంతో రూ.3 వేల నుంచి రూ.4 వేలు ఖర్చు చేయాల్సి వచ్చిందని పలువురు రోగులు వాపోతున్నారు.
నిర్లక్ష్యం హెచ్‌ఐవీకి అత్యంత సమర్ధవంతమైన చికిత్స ఉంది. ఏఆర్‌టీ మందులు మంచి జీవనశైలితో హెచ్‌ఐవీ రోగులు దీర్ఘకాలం బతికే అవకాశం ఉంది.

పౌష్టికాహారం తీసుకోవడం, చెడు అలవాట్లను మానేయడం, వైద్యులు సూచించిన ప్రకారం ల్యాబ్‌ టెస్ట్‌లు మందులు ప్రారంభించినప్పుడు ఉన్న సీడీ4 సంఖ్య వీటన్నింటిపై రోగి ఆయుష్‌ ఆధారపడి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఒక్కసారి చికిత్స ప్రారంభించిన తరువాత కొనసాగిస్తూనే ఉండాలి. హెచ్‌ఐవీ వైరస్‌లు కొన్ని మందుల్ని తట్టుకోగలవు ఒకేరకమైన మందులను కొన్ని సంవత్సరాలు వాడుతుంటే వైరస్‌ మందుల్ని తట్టుకొనే సామర్థ్యం పెంచుకుంటుంది. అందుకనే కొన్ని సంవత్సరాలకు మందుల్ని మారుస్తూ ఉంటారు. కొన్ని వైరస్‌లు అయితే ఒకటి కంటే ఎక్కువ మందుల్ని తట్టుకోగలుగుతున్నాయి. దీనినే వైరస్‌ రెజిస్టన్స్‌ అంటారు. వీటి చికిత్సకు ఒకేసారి రెండుమూడు రకాల మందుల్ని వాడుతూ ఉంటారు. వీటిని హెచ్‌ఐవి కాక్‌ టెయిల్‌ లేదా ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ అని పిలుస్తారు. అయితే సెకండ్‌ స్టేజ్‌ రోగులకు అందించాల్సిన మందుల కొరత రావడంపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అత్యవసరంగా కొనుగోలు చేయాల్సిన మందుల విషయంలో సైతం రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గతేడాది నవంబర్‌ నుంచే నాకో అరకొరగా మందులు సరఫరా చేస్తోందన్న వాదనలు ఉన్నాయ. రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా జిల్లాస్థాయిలో మందులు కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మందుల కొరత యథావిధిగా కొనసా..గుతోందన్నదన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement