కోనసీమ జిల్లా మండపేటలో వారాహి విజయభేరి సభ
మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటన్న పవన్
ఈ విషయంపై ప్రజలు నిలదీయాలని పిలుపు
జగన్ కు, వైసీపీకి ప్రజలు పొలిటికల్ హాలిడే ప్రకటించాలని వ్యాఖ్యలు
వైసీపీకి ఓట్లేస్తే ప్రజలు ఆస్తులు వదులుకోవాల్సిందేనని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. కోనసీమ జిల్లా మండపేటలో బుధవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ప్రస్తావించారు. వైసీపీకి ఓటేస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే అవుతాయని వ్యాఖ్యానించారు. మన ఆస్తి పత్రాలపై జగన్ హక్కు ఏంటి? ఈ విషయాన్ని ప్రజలు నిలదీయాలని పిలుపునిచ్చారు. భారత పాస్ పోర్టుపై ప్రధాని మోదీ ఫొటో ఉండదని, ఏపీలో పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఎందుకని ప్రశ్నించారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఏపీ ప్రభుత్వ రాజముద్ర ఉండాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలకు జగన్ పాలన నుంచి విముక్తి..
రాష్ట్ర ప్రజలకు జగన్ పాలన నుంచి విముక్తి కలిగించాలన్నదే తన బలమైన ఆకాంక్ష అని పవన్ పేర్కొన్నారు. పదేళ్లుగా తనను అనేక ఇబ్బందులకు గురిచేశారని, ఎన్నో మాటలు అన్నారని మండిపడ్డారు. ప్రజల కోసం ఎన్ని మాటలైనా భరిస్తానని, ప్రజాసంక్షేమం కోసం ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. ఓటు చీలకూడదు… ప్రజలే గెలవాలి… వైసీపీ అవినీతి కోటను బద్దలు కొట్టాలి అనేదే తన లక్ష్యమని వివరించారు. ఈ ఎన్నికల ద్వారా జగన్, వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించాలని పిలుపునిచ్చారు.