ప్రముఖ సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం కత్తి మహేష్ అంత్యక్రియలు ముగిశాయి. జూన్ 26న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కత్తి మహేష్.. చికిత్స పొందుతూ శనివారం(జులై 10) కన్నుమూశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని యర్రావారిపాలెం మండలం యలమంద గ్రామంలో కత్తి మహేష్ అంత్యక్రియలు సోమవారం జరిగాయి. బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు కత్తిమహేష్ కు కడసారిగా కన్నీటి వీడ్కోలు పలికారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.
అంతిమయాత్రలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పాల్గొన్నారు. స్వయంగా కత్తి మహేష్ పాడె మోశారు. కత్తి మహేష్ మృతదేహానికి ఖననం చేసే వరకు మంద కృష్ణ అక్కడే ఉన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కత్తిమహేష్ మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని మందకృష్ణ మాదిగ అన్నారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కారులో కత్తి మహేష్‌తో పాటు ప్రయాణించిన సురేష్ అనే వ్యక్తికి ఒక్క గాయం కూడా కాకపోవడం అనుమానాలకు దారి తీస్తోందని పేర్కొన్నారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న సురేష్ వైపుగానే కారు నుజ్జునుజ్జు కాగా, అతడికి చిన్న గాయం కూడా కాకపోవడం.. పక్కన కూర్చుకున్న కత్తి మహేష్‌కు అంత తీవ్రంగా గాయాలు కావడం వంటి పరిణామాలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని పేర్కొన్నారు.
చెన్నై అపోలో ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి అంతా బాగానే ఉందని, కొద్ది రోజుల్లోనే కోలుకుని డిశ్చార్జి అవుతారని ప్రకటించిన కొద్ది గంటల్లోనే మరణించారని చెప్పడం అనేక అనుమానాలకు దారి తీస్తోందని మంద కృష్ణ మాదిగ అన్నారు. కత్తి మహేష్‌కు ప్రమాదం జరిగినప్పటి నుంచి ఆస్పత్రిలో జరిగిన వైద్యం, మరణం వరకు సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మంద కృష్ణ కోరారు. సీఎం జగన్మోహన్ రెడ్డి, కత్తి మహేష్ ను కాపాడుకొనేందుకు ఎంతో ప్రయత్నించారని, అయితే దురదృష్టవశాత్తు మృతి చెందడం బాధాకరమన్నారు.