(ఆంధ్రప్రభ, విజయవాడ) : నగరంలోని కొత్త ప్రభుత్వాసుపత్రిలో కృష్ణా జిల్లా పామర్రు సజ్జవరం గ్రామానికి చెందిన పవన్ కుమార్ (55) గుండెపోటుతో జీజీహెచ్‌లో మృతి చెందాడు. తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్న పవన్ కుమార్ శనివారం తెల్లవారుజామున తీవ్ర గుండెపోటుతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. అయితే తీవ్ర గుండెపోటుతో బాధపడుతున్న పవన్ కుమార్‌కు కనీస వైద్యం అందించలేదని బంధువులు ఆరోపించారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే పవన్ మృతి చెందాడని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పేదల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. గుండె సంబంధిత సమస్య ఉంటే ఎమర్జెన్సీ వార్డులో కాకుండా జనరల్ వార్డులో వైద్యం అందించడం దారుణమన్నారు. ఐసీయూలో ఖాళీ లేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ, బాధితులకు అందుతున్న వైద్యం గురించి కూడా కనీసం చెప్పలేదు అన్నారు.
ఆ ఆరోపణలు అవాస్తవం..
కొత్త ప్రభుత్వాసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ ఎ వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. శనివారం తెల్లవారుజామున పవన్‌కుమార్ అనే పేషెంట్ అడ్మిట్ అయ్యాడని, పవన్‌కుమార్ మృతి పట్ల ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం ఎంతమాత్రం లేదన్నారు. రోగి పవన్ కుమార్ మృతి పై ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ ఆరా తీశారన్న ఆయన, డాక్టర్ ల ట్రీట్మెంట్ లో ఎటువంటి అశ్రద్ధ లేదన్నారు.
మూడు వారాల క్రితం పేషెంట్ పవన్ కుమార్ మెడపై నుంచి కింద పడ్డాడని… గత మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని తెలిపారు. ఆసుపత్రిలో చేరే సమయంలో హర్ట్ బీట్ కూడా ఎక్కువైంది. వైరల్ హెమరేజిక్ ఫీవర్ వల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉందని, ముగ్గురు సీనియర్ వైద్యులతో విచారణ చేపట్టామన్నారు. సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామన్నారు.