బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రభోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ గంగాధర మండపం నుంచి ప్రారంభమై నంది మండపం వరకు సాగిన ప్రభలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ రకాల ప్రత్యేక పుష్పాలతో అలంకరించిన ప్రభపై అర్చక వేదపండితులు కూర్చుని ఊరేగింపులో పాల్గొన్న భక్తులకు స్వామిఅమ్మవార్ల ఆశీస్సులు, అక్షింతలు అందజేశారు. ప్రభోత్సవం ముందు కోలాటాలు, చెక్కభజనలు, సాంప్రదాయ మేళాల చప్పుళ్లు, కళాకారుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయని ఈవో లవన్న తెలిపారు.
నందివాహనంపై విహారం..
ప్రభోత్సవం అనంతరం స్వామిఅమ్మవార్లు నందివాహనం సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. మంగళవారం సాయంత్రం ఆలయంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పుష్పాలంకరణతో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై భ్రామరీ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లును అలంకరించి.. షోడషోపచార పూజలు నిర్వహించినట్లు ఈవో తెలిపారు. ఆలయోత్సవంలో భాగంగా స్వామిఅమ్మవార్లు నందివాహనంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉత్సవం ఆద్యంతం కళారూపాలతో ఆకట్టుకునేలా సందడిగా సాగింది.