మహాశివరాత్రి సందర్భంగా.. తమ ఇలవేల్పు మల్లన్నను దర్శించుకోవాలని పాదయాత్రగా బయలుదేరిన శివ భక్తులు వడివడిగా ఇల కైలాసం చేరుకుంటున్నారు. వారి ఆధ్యాత్మిక మార్గంలో అడుగడుగునా భక్తిభావం ఉప్పొంగుతుండగా.. మండుటెండలు సైతం చిన్నబోతున్నాయి.
నల్లమల అడవులు చల్లని గాలులతో స్వాగతం పలుకుతున్నాయి. అన్నదాతలు ఆహారపానీయాలు అందిస్తూ వారి సేవలో తరిస్తున్నారు. శ్రీశైల దేవస్థానం అధికారులు మౌలిక వసతులు కల్పించి భరోసా కల్పిస్తున్నారు. మహాశివరాత్రి ఉత్సవాలకు తరలిస్తున్న ఏపీ తో పాటు కర్నాటక, మహారాష్ట్ర భక్తులతో శ్రీశైలంలో సందడి నెలకొంది. ముఖ్యంగా ఆత్మకూరు మండల పరిధిలోని వెంకటాపురం గ్రామం నుంచి.. శ్రీశైల శిఖరం వరకు పాదయాత్రకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీశైల దేవస్థానం అధికారులు సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ముఖ్యంగా నల్లమల్ల అడవుల్లో ఎక్కడికక్కడ ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. శ్రీశైల దేవస్థానం ట్యాంకర్లతో ఆయా ట్యాంకులను నింపుతూ భక్తులకు మంచినీటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇక నల్లమల అడవుల పొడవునా దాతలు ఆహారంతోపాటు అన్న పానీయాల సౌకర్యాలు కల్పించడం విశేషం.