ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటున్నాడు
స్వంత డబ్బుతో పార్టీని నడుపుతున్నాడు
కౌలు రైతులను ఆదుకున్న నేత
తన కంటే ప్రజలే మిన్నగా బావిస్తున్న ప్రజా సేవకుడు
పీఠాపురంలో పవన్ కల్యాణ్ భారీమెజార్టీతో గెలిపించాలి
మెగాస్టార్ చిరంజీవి ఓటర్లకు వీడియో సందేశం
ఏపీలో ఎన్నికలకు వారం రోజుల వ్యవధి కూడా లేదు. అన్ని పార్టీలు విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. అధికార వైసీపీని గద్దె దించేందుకు టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన తమ్ముడు, జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి ఎక్స్ వేదికగా వీడియో సందేశాన్ని ఇచ్చారు. జనసేనానిని గెలిపించాలని వీడియోలో ఆయన కోరారు. తమ ఇంట్లో ఆఖరివాడైనా ప్రజలకు మంచి చేయడంలో పవన్ ముందు ఉంటారని అన్నారు. ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాడన్నారు. తన తమ్ముడు పడుతున్న అవస్థలు చూస్తుంటే బాధేస్తుందన్నారు.
“కొణిదెల పవన్ కల్యాణ్… అమ్మ కడుపున ఆఖరి వాడిగా పుట్టినా… అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందు వాడిగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం మా తమ్ముడు కల్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కల్యాణ్… తన సొంత సంపాదనను కౌలు రైతుల కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు వద్ద ప్రాణాలను ఒడ్డి పోరాడే జవాన్ల కోసం పెద్ద మొత్తం అందివ్వడం… ఇలా ఎన్నెన్నో. ఆయన చేసిన పనులు చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంటుంది.
సినిమాల్లోకి తను బలవంతంగా వచ్చాడు. రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంతో వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధ పడుతున్న అమ్మకు ఈ అన్నయ్య ఒక మాట చెప్పాడు. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధమమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అని చెప్పాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచి వాళ్ల వల్లే ప్రజాస్వామ్యానికి ఎక్కువ నష్టమని నమ్మి జనం కోసం జనసైనికుడు అయ్యాడు. తను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన వ్యక్తి పవన్ కల్యాణ్.
ప్రజల కోసం, రాష్ట్రం కోసం ఆ శక్తిని వినియోగించాలంటే చట్ట సభల్లో ఆయన గొంతును మనం వినాలి. జనమే జయం అని నమ్మే జనసేనాని ఏం చేయగలడో మీరు చూడాలంటే… పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించాలి. సేవకుడిగా, సైనికుడిగా అండగా నిలబడతాడు, మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కల నిజం చేస్తాడు. పిఠాపురం ప్రజలకు మీ చిరంజీవి విన్నపం. గాజు గ్లాసు గుర్తుకు మీ ఓటు వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించండి. జైహింద్” అని చిరంజీవి తన సందేశాన్ని ఇచ్చారు.