నెల్లూరు, ప్రభన్యూస్ : కరోనా కష్టకాలంలో పనులు లేక పూట గడవక ఇబ్బందులు పడిన బడుగు జీవులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఓ వరంలా మారింది. జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా) ఆధ్వర్యంలో గ్రామాల్లోని కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా అధికంగా పని దినాలు కల్పించి వారికి ప్రభుత్వం ఎంతో భరోసాగా నిలిచింది. అలాగే గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు, బల్క్ మిల్క్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, ఇలా అనేక ప్రభుత్వ భవన నిర్మాణాలకు ఈ పథకాన్ని అనుసంధానం చేయడంతో కూలీలకు ఎక్కువ రోజులు పని లభించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు నేతృత్వంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 4.34 లక్షల కుటుంబాలకు చెందిన 7.55 లక్షల మంది ఉపాధి హామీ కూలీలకు ఒక కోటి 15 లక్షల పనిదినాలు కల్పించారు. ఇందుకు రూ.252 కోట్ల రూపాయలను వేతనాలుగా చెల్లించారు. అంతేకాకుండా 18,266 కుటుంబాలకు వంద రోజులు పని కల్పించారు. ఒక్కో కుటుంబానికి ఇంతవరకు సరాసరి 45 పనిదినాలు కల్పించి సరాసరి రోజు కూలి రూ.217లు వేతనంగా చెల్లించారు. ఇది జిల్లా ఉపాధి హామీ పథకం చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తోంది.
ఈ పథకం ప్రారంభించిన ఈ 14 సంవత్సరాల్లో ఇదే అత్యధికం కావడం విశేషం. అలాగే ఈ ఫిబ్రవరి నెలలో ఒక్కరోజులో లక్షకుపైగా పనిదినాలు కల్పించి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో నిలవడం గర్వకారణంగా పేర్కొనవచ్చు. ఉపాధి హామీ పథకంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఎకరాల్లో పండ్ల తోటల పెంపకాన్ని లక్ష్యంగా నిర్దేశించారు. ఇందులో భాగంగా 1,452 మంది రైతులను గుర్తించి 2,510 ఎకరాల్లో అనగా లక్ష్యాలకు మించి అధికంగా 120 శాతం మొక్కలు నాటడం జరిగింది. ఇందుకోసం రూ. 2.71కోట్లు ఖర్చు చేశారు. తద్వారా పండ్ల తోటల సాగులో రాష్ట్ర ప్రభుత్వం విప్లవం తీసుకొస్తోంది. బీడు భూముల్లో సైతం ఉద్యాన పంటల సాగు చేసేలా చేస్తుంది. మరోపక్క జిల్లాలో రహదారుల వెంబడి 447.57 లక్షల రూపాయలతో 1180 కిలోమీటర్ల మేర 4.90 లక్షల మొక్కలు నాటారు. అదేవిధంగా బండ్ ప్లాంటేషన్ కింద 74 మంది రైతులకు చెందిన పొలం గట్లపై అధిక సంఖ్యలో టేకు మొక్కలు వేశారు. ఇనిస్టిట్యూషన్ ప్లాంటేషన్‌లో భాగంగా 115 ప్రభుత్వ సంస్థల్లో 6,118 మొక్కలు నాటారు. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలకు కూడా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జోడించి ముందుకు తీసుకువెళ్తున్నారు. నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 59,106 మంది లబ్ధిదారులకు 2,152.32 ఎకరాల భూమిలో 357 లే అవుట్ల్‌లో మౌలిక సదుపాయాలు పనులను మంజూరు చేశారు. రూ. 65.62 కోట్లతో 165 పనులు పూర్తి చేశారు. జిల్లాలో 115 కోట్లతో 659 గ్రామ సచివాలయం భవనాల నిర్మాణం చేపట్టగా ఇప్పటికే వాటిలో 282 వరకు పనులు పూర్తి చేశారు.
అదే విధంగా ఈ సంవత్సరంలో 50 కోట్ల రూపాయలతో రైతు భరోసా కేంద్రాలను మంజూరు చేయగా, వాటిలో ఇప్పటికే 169 పనులు పూర్తికాగా, మరో 478 పనులు వివిధ దశల్లో ఉన్నాయి .గ్రామీణ ప్రజానీకానికి మరింత మెరుగైన వైద్యం అందించే దిశగా రూ.98 కోట్లతో 528 వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లను ఈ పథకం కింద మంజూరు చేశారు. ఇప్పటికే వీటిలో 75 పనులు పూర్తికాగా, మరో 444 భవన నిర్మాణ పనులు ప్రగతిలో ఉన్నాయి. జిల్లాలో పాడి రైతులకు ఆర్ధిక తోడ్పాటు కల్పించాలనే దిశగా పాలవెల్లువ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం రూ. 25.76 కోట్ల విలువైన 163 పాల శీతలీకరణ కేంద్రాలను మంజూరు చేయగా వాటి నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో మరీ ముఖ్యంగా యువతకు సాంకేతిక విజ్ఞానాన్ని మరింత చేరువచేసే దిశగా రూ.60.80 కోట్లతో జిల్లాలో 378 వైఎస్సార్ డిజిటల్ లైబ్రరీ లను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటికే 336 పనులు పురోగతిలో ఉన్నాయి. మరోపక్క జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలల ప్రహరీ గోడల నిర్మాణాలను మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టింది. ఇందులో భాగంగా రూ. 42.16 కోట్ల విలువైన 606 పనులను మంజూరు చేయగా వాటిలో 404 పనులు ప్రగతిలో ఉన్నాయి. అలాగే జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో చేపట్టిన గ్రామ కొలనుల నిర్మాణ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. ఇలా జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..