శివరాత్రి ఏర్పాట్లపై అధికారుల ప్రాథమిక సమావేశం
కర్నూలు బ్యూరో : శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుండి మార్చి1 వరకు నిర్వహించనున్నారు. 11రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం శ్రీశైలం కార్యనిర్వాహణ అధికారి ఎం.శ్రీనివాసరావు దేవస్థానం, ఇంజనీరింగ్ అధికారులతో పర్యవేక్షకులు, వైదిక కమిటీతో ప్రాథమిక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక తహశీల్దార్ కె.వి.శ్రీనివాసులు, అటవీశాఖ రేంజ్ అధికారి సుభాష్ రెడ్డి, మండల ప్రాథమిక వైద్యశాల వైద్యురాలు డా.ఆర్.శ్రీవాణి, స్థానిక పోలీస్ స్టేషన్ ఎ.ఎస్.ఐ బి.సి.గురువయ్య, దేవస్థానం వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న అపోలో వైద్యులు డా.టి. శశిధర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో ముందుగా గత సంవత్సరపు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు.
అనంతరం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ… జిల్లా యంత్రాంగ సహాయ సహకారాలతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సిబ్బంది అందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి ఒక్క ఉద్యోగి కూడా భక్తుల సౌకర్యాల పట్ల పూర్తి శ్రద్ధవహించాలన్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అన్ని విభాగాల వారిని ఆదేశించారు. అన్ని విభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, ఆయా విభాగాల పరంగా చేపట్టాల్సిన చర్యలకు తగు ముందస్తున్న ప్రణాళికలను (యాక్షన్ ప్లాన్) రూపొందించాలన్నారు. అనుగుణంగా ఏర్పాట్లలో నిమగ్నం కావాలన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా ఫిబ్రవరి మొదటివారం చివరిలోగానే పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ఫిబ్రవరి 19 నుంచి బ్రహ్మోత్సవాలు…
బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19వ తేదీ ప్రారంభమవుతున్నప్పటికీ, ముందస్తుగానే భక్తులు క్షేత్రానికి చేరుకుంటారని చెబుతూ అన్ని ఏర్పాట్లు కూడా ముందస్తుగా పూర్తికావడం తప్పనిసరి అన్నారు. దేవస్థానం ఉద్యోగులందరూ కూడా సమర్థవంతంగా విధులు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలన్నారు. దేవస్థానం అన్ని విభాగాలు కూడా సమిష్టిగా పరస్పర సమన్వయంతో ఉత్సవ నిర్వహణలో విధులు నిర్వహించాలన్నారు.
ముఖ్యంగా గత సంవత్సరం కంటే కూడా ప్రతీచోటకూడా అవకాశం మేరకు 20శాతం నుంచి 30శాతం దాకా అదనపు ఏర్పాట్లు ఉండాలన్నారు.అనంతరం కార్యనిర్వహణాధికారి విభాగాల వారీగా బ్రహ్మోత్సవ ఏర్పాట్లకు సంబంధించిన అంశాలను గురించి కూలంకుషంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆయా విభాగా ధిపతులకు, పర్యవేక్షకులకు పలు ఆదేశాలు జారీ చేశారు.వైదిక సిబ్బంది,ఆలయ విభాగాధికారులు పరస్పర సమన్వయంతో ఉత్సవాలలో జరిగే ఆయా కైంకర్యాలన్నీ ఎలాంటిలోటు లేకుండా సంప్రదాయబద్ధంగా జరిపించాలన్నారు. ఈ విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని ఆలయవిభాగానికి సూచించారు.
తరువాత ఉత్సవాలలో నిర్వహించాల్సిన ఆయా వైదిక కార్యక్రమాలు, వాహనసేవలు, స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ, ఉత్సవాల సమయంలో ఆలయ వేళలు, దర్శనం ఏర్పాట్లు మొదలైన వాటి గురించి చర్చించారు. ఇక మహా శివరాత్రి రోజైన ఫిబ్రవరి 26న జరిగే ప్రభోత్సవం, పాగాలంకరణ, బ్రహ్మోత్సవ కల్యాణం, ఆ మరునాడు జరిగే రథోత్సవం తదితర కార్యక్రమాలకు సంబంధించి తగు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు.
పాదయాత్ర భక్తులకు సౌకర్యాలు..
అనంతరం పాదయాత్రతో వచ్చే భక్తుల సౌకర్యార్థం నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం, సాక్షిగణపతి మొదలైన చోట్ల చేయవలసిన ఏర్పాట్ల గురించి చర్చించారు. అటవీశాఖ సహకారముతో నడకదారిలో వచ్చే భక్తులకు ఆయా ఏర్పాట్లను కల్పించాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. ముఖ్యంగా శివదీక్షా భక్తులకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు, జ్యోతిర్ముడి సమర్పణకు చేయాల్సిన ఏర్పాట్లు మొదలైనవాటి గురించి పలు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మహాశివరాత్రికి వచ్చే భక్తులు సేదతీరేందుకు ఆరుబయలు ప్రదేశాలలో పైప్ పెండాల్స్, షామియానాలు మొదలైన వాటిని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వీటివద్ద తగినంత విద్యుద్దీపాల ఏర్పాటు ఉండాలన్నారు. అదేవిధంగా తగినన్నీ శౌచాలయాలు ఉండాలన్నారు. ఈ సంవత్సరం సంచార శౌచాలయాల ఏర్పాటును కూడా పరిశీలించాలన్నారు.
క్యూకాంప్లెక్స్ లో, క్యూలైన్ల లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా దర్శనానికి వేచివుండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం మొదలైన వాటిని అందజేస్తుండాలని అన్నప్రసాదవితరణ విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై ఎటువంటి లోపాలు ఉండకూడాదన్నారు.క్యూలైన్లన్నీ ధృడంగా ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రజాసౌకర్యాలకు అవసరమైన అన్ని మరమ్మతులు చేయించి అన్నింటిని కూడా వినియోగంలోకి వచ్చేవిధంగా తగు ఏర్పాట్లు చేయాలని పారిశుద్ధ్య విభాగపు అధికారులను ఆదేశించారు.క్షేత్ర పరిధిలో అవసరమైన చోట్ల అదనపు కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు.స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు.
గతంలో వలనే క్షేత్రపరిధిని జోన్లుగా, సెక్టార్లుగా విభజించి ఎప్పటికప్పుడు చెత్తాచెదారాలను తొలగించేవిధంగా పారిశుద్ధ్య ఏర్పాట్లు ఉండాలన్నారు. పార్కింగ్ ఏర్పాట్లు, సామానులు భద్రపర్చుగది, ట్రాఫిక్ నియంత్రణ మొదలైన అంశాలపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, భద్రతా విభాగం ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. గత సంవత్సరం కంటే కూడా ఈ సారి అదనపు ప్రదేశాలలో కూడా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.
అలాగే పార్కింగు ప్రదేశాల వివరాలు స్పష్టంగా తెలిసేవిధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలలో ట్రాఫిక్ నిలిచిపోవడం లాంటి అంతరాయాలు లేకుండా ఉండేందుకు తగు ముందస్తు చర్యలు చేపట్టాలని భద్రతా విభాగాన్ని ఆదేశించారు. ఈ విషయమై స్థానిక పోలీస్ శాఖ వారితో తగు సమన్వయ చర్యలు చేపట్టాలని కూడా ఆదేశించారు. ఉత్సవ సమయాలలో ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించి రికవరీ వాహనం, టోయింగ్ వాహనాలను కూడా అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అదేవిధంగా పాతాళగంగలో కూడా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. ముఖ్యంగా పాతాళగంగలో సేఫ్టీ మెష్ (రక్షణ కంచె), పాతాళగంగలో మహిళలు దుస్తులు మార్చుకునేందుకు అవసరమైన గదుల ఏర్పాటు పాతాళగంగ మెట్ల మార్గంలో అవసరమైన మరమ్మతులు మొదలైన వాటిపట్ల శ్రద్ధ కనబర్చాలన్నారు.
భక్తులరద్దీకి తగినట్లుగా అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు ఉండాలన్నారు. క్షేత్రపరిధిలో అన్నదానం చేసే స్వచ్ఛంద సేవా సంస్థలకు దేవస్థానం పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు. ఉత్సవాలలో పండుగ వాతావరణం ఉండేవిధంగా విద్యుద్దీపాలంకరణ ఉండాలని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. అదేవిధంగా ఆరుబయలు ప్రదేశాలలో తగినంతగా విద్యుద్దీపాల ఏర్పాటు ఉండాలన్నారు. ఉత్సవాలలో పుష్పాలంకరణను సంప్రదాయబద్దంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఉద్యానవన అధికారిని ఆదేశించారు. భక్తులను అలరించేందుకు ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల విభాగాన్ని ఆదేశించారు. వేదసంస్కృతి, సనాతన ధర్మంపై అవగాహన కలిగించే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. సమావేశంలో వివిధ శాఖ అధికారులు ప్రసంగించారు.