Friday, October 18, 2024

AP: గుంటూరుకు మహార్దశ.. ఆర్ఓబీకి కేంద్రం ఓకే…

గుంటూరు ప్రజలకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని కానుక
శంకర్ విలాస్ వంతెన 4 లైన్ల విస్తరణ – ఆర్ వో బీ నిర్మాణానికి రూ. 98 కోట్లు మంజూరు
పెమ్మసాని తొలి ప్రతిపాదనకు నితిన్ గడ్కరీ ఆమోదముద్ర
ఎక్స్ ఖాతా వేదికగా ప్రకటించిన కేంద్ర మంత్రి
ఉమ్మడి గుంటూరు బ్యూరో, (ఆంధ్రప్రభ): దశాబ్దాల గుంటూరు కలలకు గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఊపిరిలూదారు. ప్రజలకు ఏం కావాలో ఎరిగిన నాయకులుగా తన ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. గుంటూరు ప్రజల ట్రాఫిక్ సమస్యలను తీర్చడంలో ప్రధాన పాత్ర పోషించే శంకర్ విలాస్ వంతెన నాలుగు లైన్ల విస్తరణ – ఆర్.ఓ.బి నిర్మాణమే ధ్యేయంగా ముందుకు వెళుతున్న పెమ్మసాని కృషికి కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ప్రకటించింది. సి ఆర్ ఐ ఎఫ్ పథకం కింద ఆయా నిర్మాణాలకు రూ. 98 కోట్లను మంజూరు చేస్తున్నట్లుగా రోడ్ ట్రాన్స్ పోర్ట్, హైవేస్ కేంద్ర మంత్రి నితిన్ గట్కరి ఎక్స్ ఖాతా వేదికగా ఆయన తమ అంగీకారాన్ని ప్రకటించారు. దీంతో గుంటూరు పార్లమెంటు పరిధిలో ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.

కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి గుంటూరు పార్లమెంట్ ప్రజలకు ఇచ్చిన హామీలపైనే పెమ్మసాని దృష్టి పెట్టారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జులై 30వ తేదీన కేంద్ర, ప్రభుత్వానికి శంకర్ విలాస్ వంతెన విస్తరణ – రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపారు. రూ 108 కోట్ల ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా రివైజ్ చేసిన కేంద్ర ప్రభుత్వం రూ. 98 కోట్లను సి ఆర్ ఐ ఎఫ్ పథకం కింద అమల్లో ఉన్న రామసేతు పథకం ద్వారా మంజూరు చేయబోతున్నట్లుగా పరోక్షంగా ప్రకటించింది. మరో 3 – 4 రోజుల్లో కేంద్ర ప్రభుత్వం తన అధికారికంగా ప్రకటనను విడుదల చేయబోతుందని సమాచారం.

గుంటూరుకు వరస కడుతున్న ప్రాజెక్టులు

- Advertisement -

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల కొద్దీ పనిచేస్తున్న పెమ్మసాని నేతృత్వంలో గుంటూరు పార్లమెంటుకు ప్రాజెక్టులు, పరిశ్రమలు క్యూ కడుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందులో భాగంగానే మొన్న రూ. 250 కోట్ల విలువైన టెక్నాలజీ సెంటర్ అమరావతికి మంజూరు, నిన్న ప్రత్తిపాడు నియోజకవర్గంలో 100 పడకల ఈ.ఎస్.ఐ ఆసుపత్రికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం, నేడు శంకర్ విలాస్ నాలుగు లైన్ల విస్తరణ – ఆర్.ఓ.బి నిర్మాణానికి కేంద్రంతో ఆమోదముద్ర వేయించడంలో పెమ్మసాని సఫలీకృతులయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు గుంటూరులోని సంబంధిత శాఖాధికారులతో పెమ్మసాని పలు సమీక్ష సమావేశాలు నిర్వహించడంతోపాటు కేంద్ర ప్రభుత్వం తోనూ అనేకసార్లు సమావేశాలు జరిపారు.

ఆదివారాలు, సెలవు దినాలు సైతం రివ్యూ సమావేశాలతో పెమ్మసాని పని చేస్తూ, అధికారులతో పని చేయించిన సమయంలో కొందరు నొచ్చుకున్నప్పటికీ, ప్రజా సమస్యల పరిష్కారం, డి.పి.ఆర్ లను సిద్ధం చేయడమే లక్ష్యంగా పెమ్మసాని ముందుకు వెళ్లారు. పెమ్మసాని తీసుకున్న ఆ వేగవంతమైన నిర్ణయాల ఫలితంగా కేవలం 2-3 నెలల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం స్పందించి దశాబ్దాల కలగా మిగిలిన ఈ ప్రాజెక్టుకు మంజూరుకు నిదర్శనంగా నిలిచింది.

గాలికి వదిలేసిన గత ప్రభుత్వం
జగన్ ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు పరిశ్రమల కోసం కేంద్ర ప్రభుత్వం పలుమార్లు స్పందించిన సరే అప్పటి పాలకులు ఏపీ గుంటూరు అభివృద్ధికి మొగ్గుచూపులేదు. 2021 లో గుంటూరు పార్లమెంటు పరిధిలోని 38 నిర్మాణాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన ఆమోదం తెలియజేస్తూ ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది అందులో చివరి ప్రాధాన్యత క్రమంలో శంకర్ విలాస్ వంతెన నిర్మాణం కూడా ఉంది అయితే జగన్ ప్రభుత్వం వహించిన నిర్లక్ష్యం కారణంగా ఆయా ప్రతిపాదనలు అన్ని వెనక్కి వెళ్ళిపోయాయి. అయితే ఎంపీగా కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరించిన మరుక్షణం నుంచి గుంటూరు అభివృద్ధికి తీసుకున్న జాగ్రత్తల కారణంగా కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గుంటూరు అభివృద్ధికి ఆమోదముద్ర వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement