Saturday, November 23, 2024

పార్టీ దశ, దిశ నిర్దేశించేలా మహానాడు.. 27న ప్రతినిధుల సదస్సు

అమరావతి, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని, భవిష్యత్‌ ప్రయాణాన్ని, పార్టీ దశ, దిశ నిర్దేశించేలా పసుపు పండగకు సర్వం సిద్ధమవుతుంది. ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడును నిర్వహించాలని తెదేపా అధిష్టానం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఒంగోలు వేదికగా ఈ ఏడాది మహానాడును నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మహానాడుకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ వర్గాలు శరవేగంగా పూర్తి చేస్తుంది. మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ రానున్న ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. అలాగే ఈ మహానాడులో పలు కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా ఎన్నికల సన్నద్ధంలో భాగంగా పార్టీ అధినేత చంద్రబాబు రాష్ట్రవ్యాప్త పర్యటనలు, లోకేష్‌ సైకిల్‌ యాత్రపై ప్రకటన వెలువడనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నెల 27న తొలిరోజు 12 వేల మందితో ప్రతినిధుల సభను నిర్వహించాలని నిర్ణయించిన అధిష్టానం ఇప్పటికే ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతుంది. రెండో రోజైన 28వ తేదీన లక్ష మందితో మహానాడును నిర్వహించనున్నారు. ఇదే వేదికగా ఎన్టీఆర్‌ శత జయంతోత్సవాలను కూడా చంద్రబాబు ప్రారంభిస్తారు.

ఈ శత జయంతి వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏడాది పాటు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నెల 26వ తేదీన టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం అమరావతిలో జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పొలిట్‌ బ్యూరో సభ్యులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ముఖ్యనేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 15 తీర్మానాలను ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 12, తెలంగాణ నుంచి 3 తీర్మానాలను నేతలు ప్రవేశపెడతారు. పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు నేతృత్వంలో తీర్మానాలను రూపొందిస్తున్నారు. పొలిట్‌ బ్యూరో సమావేశంలో ఈ తీర్మానాలపై చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు. రెండు రాష్ట్రాల పార్టీ నేతలు, అతిథిలకు బస, ఇతర సదుపాయాలను కల్పించేందుకు పార్టీ యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టింది. మహానాడు నిర్వాహణలో భాగంగా మొత్తం 16 కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేసి ఆ కమిటీలకు బాధ్యతలు అప్పగించడం జరిగింది. మహానాడులో తొలిరోజు ప్రతినిధుల సభను ఉద్దేశించి పార్టీ అధినేత చంద్రబాబు ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. రెండో రోజు భారీ బహిరంగ సభను నిర్వహిస్తారు. ఈ నెల 26వ తేదీ నాటికి మహానాడు ఏర్పాట్లు పూర్తి కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement