మహాశివరాత్రిని పురస్కరించుకుని శివ నామస్మరణంతో శ్రీశైలం మారుమోగుతుంది. నవాహ్నిక దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా నాలుగవరోజైన శుక్రవారం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం యాగశాలలో చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేపట్టారు. లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు నిర్వహించారు. ఆ తర్వాత మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి పటణ గావించారు. వీటితో పాటు నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా జరిపించడం విశేషం. అదే విధంగా ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు జరిపించడం గమనార్హం.
మయూర వాహనసేవలో స్వామి, అమ్మవారు బ్రహ్మోత్సవాలలో సాయంకాలం స్వామి అమ్మవార్లకు మయూరవాహనసేవ నిర్వహిస్తారు. ఈ సేవలో స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో మయూర వాహనంపై వేంచేబు చేయించి, ప్రత్యేక పూజాదికాలు నిర్వహించబడుతాయి. అనంతం శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవం జరుగనున్నది. కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, ఢమరుకం, చితడలు, శంఖం, పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలను గ్రామోత్సవంలో నిర్వహించనున్నారు. వీటితో పాటు శ్రీశైలంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.